'అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం..' రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

by S Gopi |
అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలుడిన జూన్ 4న భారత స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమైన సంగతి తెలిసిందే. రిటైల్ ఇన్వెస్టర్లు రూ. 30 లక్షల కోట్లకు పైగా నష్టాలను ఎదుర్కొన్నారు. అయితే, ఈ పరిణామాన్ని రాహుల్ గాంధీ 'అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం' అని కీలక ఆరోపణలు చేశారు. గురువారం విలేఖరుల సమావేశంలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. ఎన్నికల ఫలితాల ప్రకటనకు కొద్ది రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా బీజేపీ అగ్ర నాయకులు స్టాక్ మార్కెట్ గురించి ఎందుకు వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు. ఈ స్కామ్‌లో ప్రధాని మోడీ, అమిత్‌ షా పాత్ర ఉందని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం జూన్‌ 3న వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో ఉద్దేశపూర్వకంగా బీజేపీ భారీ మెజారిటీ సాధిస్తుందని ప్రచారం చేశారు. అందుకే ఆ తర్వాత స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఎన్నికల ఫలితాల రోజు మళ్లీ భారీగా నష్టాలు ఎదురయ్యాయి.

ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నడూ లేనివిధంగా "స్టాక్ మార్కెట్ చాలా స్పీడ్‌తో పెరుగుతోందని' అన్నరు. జూన్ 4న స్టాక్ మార్కెట్ పెరుగుతుందని, మీరందరూ పెట్టుబడులు పెట్టాలని కేంద్ర హోంమంత్రి అన్నారు. ఆర్థిక మంత్రి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. జూన్‌ 4న స్టాక్ మార్కెట్ రికార్డులను బద్దలు కొడుతుందని అసలు మోడీ, అమిత్‌ షా ఇన్వెస్టర్లకు పెట్టుబడి సలహాలు ఎందుకు ఇచ్చారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే కోట్లాది కుటుంబాలకు ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి పెట్టుబడి సలహా ఎందుకు ఇచ్చారు? పెట్టుబడి సలహా ఇవ్వడం వారి పనా?' అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ నకిలీ అని వారికి ముందే తెలుసు కాబట్టే ఇలా చేశారని ఆరోపణలు చేశారు.

ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ వెలువడటానికి ముందురోజు పెద్ద మొత్తం లావాదేవీలు జరిగాయని రాహుల్ గాంధీ ఆ వివరాలను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత రోజు లావాదేవీల్లో ఎవరెవరు పాల్గొన్నారు? లబ్ది ఎవరు పొందారు? అంటూ రాహుల్ గాంధీ అడిగారు. ఈ పరిణామాలను కొంతమంది విదేశీ పెట్టుబడిదారులు సద్వినియోగం చేసుకున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు కానీ కొంతమంది మాత్రమే లాభపడ్డారని విమర్శించారు. నరేంద్ర మోడీ, అమిత్ షాలకు ఈ కుంభకోణంలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉంది. వారితో పాటు ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన కంపెనీలు, విదేశీ శక్తుల విచారణ జరగాలని, ఈ భారీ కుంభకోణాన్ని తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ ఆరోపణలు స్పందించిన బీజేపీ ఖండించింది. బీజేపీ సీనియర్‌ నేత పీయూష్‌ గోయల్‌ స్పందిస్తూ.. రాహుల్‌ గాంధీ ఎన్నికల ఓటమిని అంగీకరించలేకపోతున్నారని, అందుకే ఇప్పుడు మార్కెట్‌ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed