Indian Constitution: రాహుల్.. రాజ్యాంగ వ్యతిరేకి: బీజేపీ ఆరోపణలు

by Mahesh Kanagandla |
Indian Constitution: రాహుల్.. రాజ్యాంగ వ్యతిరేకి: బీజేపీ ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Elections) వేళ పొలిటికల్ పార్టీలు ఫుల్ స్వింగ్‌లోకి వచ్చాయి. విమర్శలకు పదును పెడుతున్నాయి. నాగ్‌పూర్‌ మీటింగ్‌లో హాజరైన రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. రాహుల్ గాంధీ, ఆయన పార్టీ రాజ్యాంగ వ్యతిరేకమని, రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆరోపించింది. అసలు దేశంలో రాజ్యాంగం లేకుండా చేయాలన్నదే వారి అభిమతమని పేర్కొంది. రెడ్ కలర్ కవర్ ఉన్న రాజ్యాంగ పుస్తకాన్నే ఆయన ఎందుకు చూపిస్తారని సందేహాలను లేవనెత్తింది. అది అర్బన్ నక్సల్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నమేనంది.

నాగ్‌పూర్‌లో రాజ్యాంగ పరిరక్షణ థీమ్‌తో కాంగ్రెస్ పార్టీ బుధవారం ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాహుల్ గాంధీ దేశంలో రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని, అధికారపక్షం రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడి చేస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వీడియోను మహారాష్ట్ర బీజేపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియో వైరల్ అయింది. భారత రాజ్యాంగం అని రాసి ఉన్న పుస్తకాన్ని ఓపెన్ చేస్తే రాజ్యాంగ పీఠిక మినహా అంతా తెల్ల కాగితాలే ఉన్నాయి. ఖాళీ పుస్తకాన్నే రాజ్యాంగమని కాంగ్రెస్ పంపిణీ చేసిందని బీజేపీ ఆరోపించింది. ఇలాగే రాజ్యాంగాన్ని ఖాళీ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించింది. బాబాసాహెబ్ రాసిన చట్టాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని చూస్తున్నదని ఆరోపణలు చేసింది. ఇది రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఎదురుదాడికి దిగింది. కాగా, కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది. బీజేపీ అసత్య వీడియోలను ప్రచారం చేస్తున్నదని మండిపడింది. సభకు హాజరైనవారికి నోట్ బుక్, పెన్ ఇచ్చామని కాంగ్రెస్ నాయకుడు విజయ్ వాడెట్టివార్ వెల్లడించారు. ముందు రాజ్యాంగ ముఖచిత్రాన్ని చూపించి.. ఆ తర్వాత ఖాళీ నోట్‌బుక్‌ను చూపించి వీడియో తీశారని పేర్కొన్నారు.

అర్బన్ నక్సల్స్ ఆలోచనలవైపు రాహుల్ గాంధీ నిలుస్తారని తాను రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రూఢీ అయ్యాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఎర్రటి వర్ణమున్న రాజ్యాంగ పుస్తకం ద్వారా ఆయన అర్బన్ నక్సల్స్, అరాచకవాదుల రాజకీయ సహకారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నిత్యం ఏదో ఒక డ్రామా చేస్తుంటారని, రోజూ ఏదో ఒక రూపంలో రాజ్యాంగాన్ని అవమానిస్తూనే ఉన్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story