Waqf : ర్యాడికల్స్ కబ్జాలో వక్ఫ్ ఆస్తులు.. షరియత్‌తో వక్ఫ్‌కు సంబంధం లేదు : కశిష్ వార్సీ

by Hajipasha |   ( Updated:2024-08-08 18:39:10.0  )
Waqf  : ర్యాడికల్స్ కబ్జాలో వక్ఫ్ ఆస్తులు.. షరియత్‌తో వక్ఫ్‌కు సంబంధం లేదు : కశిష్ వార్సీ
X

దిశ, నేషనల్ బ్యూరో : వక్ఫ్ సవరణ బిల్లును సమర్ధిస్తూ ఇండియన్ సూఫీ ఫౌండేషన్ అధ్యక్షుడు కశిష్ వార్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలోని వక్ప్ ఆస్తులను కొందరు రాడికల్స్ కంట్రోల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి రాడికల్సే సూఫీయిజానికి నిజమైన శత్రువులన్నారు. పార్లమెంటులో సరైన చర్చ జరిగిన తర్వాత వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలపొచ్చని వార్సీ అభిప్రాయపడ్డారు. వక్ఫ్ ఆస్తులకు షరియత్‌తో ఏ మాత్రం సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. వక్ఫ్ పరిధిలోని ఆస్తులను విడిపించి, వాటి నిర్వహణ, పర్యవేక్షణకు సూఫీలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కశిష్ డిమాండ్ చేశారు. ‘‘దేశంలోని దర్గాలు, మజార్‌లు పేదలకు రోజూ అన్నం పెడుతున్నాయి. అవి సొంత జేబులను నింపుకోవడం లేదు. అయితే కొన్ని మజార్‌లను కంట్రోల్ చేస్తున్న వ్యక్తులు తమ జేబులను నింపుకునే పనిలో ఉన్నారు. ఈ అన్ని అంశాలపై పార్లమెంటులో చర్చ జరగాలి’’ ఆయన వ్యాఖ్యానించారు.

ముస్లిమేతరుల నియామకం షరియత్‌కు వ్యతిరేకం : ఆలిండియా ముస్లిం జమాత్, జాతీయ అధ్యక్షుడు

వక్ఫ్ బోర్డు చట్టానికి సవరణలు అవసరమే అని ఆలిండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ అన్నారు. అయితే బోర్డులో నాన్ ముస్లిం సభ్యులను నియమించడం అనేది సరికాదన్నరు. అది షరియత్‌కు వ్యతిరేకమైన చర్య అని వ్యాఖ్యానించారు. ‘‘ల్యాండ్ మాఫియాల సహకారంతో కొందరు వక్ఫ్ బోర్డుల ఛైర్మన్లు, మెంబర్లు వక్ఫ్ భూములను కొంటున్నారు, అమ్ముతున్నారు. ఈ వ్యవహారాన్ని ఆపాలి’’ అని ఆయన కోరారు. ముస్లిమేతర వ్యక్తిని వక్ఫ్ బోర్డులో నియమించాలనే ప్రతిపాదన షరియత్‌కు వ్యతిరేకమైందన్నారు.

Advertisement

Next Story