'పరస్పర విశ్వాసాన్ని కొనసాగించాలి.. ప్రత్యేకత కాదు'.. క్వాడ్ ప్రకటనపై చైనా ధ్వజం

by Vinod kumar |
పరస్పర విశ్వాసాన్ని కొనసాగించాలి.. ప్రత్యేకత కాదు.. క్వాడ్ ప్రకటనపై చైనా ధ్వజం
X

బీజింగ్: ఇండియా, ఆస్ట్రేలియా, యూఎస్, జపాన్‌లతో కూడిన క్వాడ్ గ్రూప్‌పై చైనా ధ్వజమెత్తింది. దేశాల మధ్య పరస్పర శాంతి చర్చలు ఉండాలని పేర్కొంది. అభివృద్ధి ని కొనసాగించేలా పరస్పర విశ్వాసం, ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడేలా చర్చలు కొనసాగాలని.. ప్రత్యేకత చాటడం ముఖ్యం కాదని చెప్పింది. శుక్రవారం న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇండో-పసిఫిక్ పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, ఆయన జపాన్ కౌంటర్ యోషిమాసా హయాషి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ పాల్గొన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో చైనా దృఢత్వం పై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో చైనా చర్యల గురించి ఇటీవల కాలంలో అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. సమావేశం అనంతరం ఒక సంయుక్త ప్రకటన విడుదలైంది. స్వేచ్ఛాయుతమైన, బహిరంగ ఇండో-పసిఫిక్‌కు నాలుగు దేశాల నిబద్దతను పునరుద్ఘాటించింది.

చట్ట నియమాల సూత్రాలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, వివాదాల శాంతియుత పరిష్కారాలకు మద్దతిస్తున్నట్టు ఆ ప్రకటన పేర్కొంది. క్వాడ్ ప్రకటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో వింగ్ స్పందించారు. పరస్పర చర్చలు తమ ప్రత్యేకత కంటే శాంతి అభివృద్ధి కి అనుగుణంగా ఉండాలని చైనా విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ‘ప్రాంతీయ పరస్పర విశ్వాసం, శాంతి, ప్రాంతీయ స్థిరత్వానికి దేశాలు మరింత సహకారం అందించాలని మేము భావిస్తున్నాము’ అని ఆమె అన్నారు.

Advertisement

Next Story