యూపీ బీజేపీలో ప్రక్షాళన..రాష్ట్ర నేతలతో హై కమాండ్ చర్చలు!

by vinod kumar |
యూపీ బీజేపీలో ప్రక్షాళన..రాష్ట్ర నేతలతో హై కమాండ్ చర్చలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. అంతేగాక పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆ రాష్ట్రంలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ చీఫ్‌ను సైతం మార్చనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత కొన్ని రోజులుగా యూపీ బీజేపీకి చెందిన కీలక నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ అగ్రనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో సమూల మార్పులు జరగనున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ప్రధాని మోడీతో బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎన్నికల్లో పార్టీ విఫలమైనందుకు గాను బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని భూపేంద్రకు ప్రతిపాదనలు చేసినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య బీజేపీ జాతీయ చీఫ్ నడ్డాతో సమావేశమయ్యారు.

రాష్ట్ర అధ్యక్షుడి మార్పు!

ఎన్నికల ఎదురుదెబ్బ నుంచి తిరిగి పుంజుకోవడానికి, అలాగే 2027 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని వెంటనే మార్చాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఓబీసీ వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఓబీసీలు గణనీయంగా ఉండటంతో ఈ అంశం రానున్న ఎన్నికల్లో కలిసి వస్తుందని బీజేపీ యోచిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్యకు రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం

రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో సీఎం యోగి ఆధిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్టు కొంత కాలంగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే తాజాగా ప్రసాద్ మాట్లాడుతూ..‘ప్రభుత్వం కంటే సంస్థ పెద్దది. సంస్థ కంటే ఎవరూ పెద్దవారు కాదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో సీఎం యోగిని ఉద్దేశించే ఆయన వ్యాఖ్యలు చేశారని పలువురు వాపోతున్నారు. ఈ వ్యా్ఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్గత పోరు కారణంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. బీజేపీ నేతలు తమలో తాము కొట్లాడుకుంటున్నారని, దీని వల్ల పాలన కుటుంబపడిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం పార్టీలో మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed