కొడుకు కోసం ఎమ్మెల్యేకు 45 మిస్డ్ కాల్స్

by Shamantha N |
కొడుకు కోసం ఎమ్మెల్యేకు 45 మిస్డ్ కాల్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: పూణే పోర్షే కారు ప్రమాదంలో మరో ఆరోపణ తెరపైకి వచ్చింది. డబ్బు, పలుకుబడితో మైనర్ నిందితుడ్ని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ కేసులో స్థానిక ఎమ్మెల్యే సునీల్ టింగ్రే పేరు పదే పదే బయటకొచ్చింది. సునీల్ టింగ్రేకు మైనర్ తండ్రికి మధ్య సంబంధాలు ఉన్నాయని తేల్చారు. మే 20 తెల్లవారుజామున 2.30 నుండి 3.45 గంటల మధ్య టింగ్రేకు 45 మిస్డ్ కాల్‌లు వచ్చాయని వివరించారు. అయితే, నిద్రపోవడంతో ఎమ్మెల్యే కాల్స్ ఆన్సర్ చేయలేదని.. బాలుడి తండ్రే స్వయంగా వెళ్లి ఎమ్మెల్యేను కలిశారని తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు ఉదయం 6 గంటల వరకు ఎరవాడ పోలీస్ స్టేషన్ లోనే ఎమ్మెల్యే ఉన్నట్లు నిర్ధారించారు. అయితే, తాను పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించానని వస్తున్న వార్తలు అవాస్తవాలని ఎమ్మెల్యే కొట్టిపారేశారు. మరోవైపు, ఈ విషయంలో ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలని ఆయన పార్టీ కోరింది. అంతే కాకుండా ఎన్సీపీ నేతతో ససూన్ హాస్పిటల్ డాక్టర్ అజయ్ తవారేకు లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ తోనే డాక్టర్ అజయ్ తవారేకు లింకులు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇద్దరు వైద్యుల సస్పెన్షన్

ఈ కేసులో ససూన్ హాస్పిటల్ కు చెందిన ఫోరెన్సిక్ మెడిసిన్ హెడ్ డాక్టర్ అజయ్ తవారే, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీహరి హల్నోర్, సిబ్బంది అతుల్ ఘట్‌కాంబ్లేపై కేసు నమోదైంది. వారు మైనర్ రక్తనమూనాలు మార్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డాక్టర్ శ్రీహరి హల్నోర్, అతుల్ ఘట్ కాంబ్లేను సస్పెండ్ చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మహరాష్ట్ర సీఎం నుంచి క్లియరెన్స్ వచ్చాక డాక్టర్ అజయ్ తవారేపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రోజు మైనర్ బాలుడి తండ్రి.. డాక్టర్ అజయ్ తవారేతో కనీసం 14 సార్లు ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మే 24న ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. విధుల్లో అలసత్వం వహించినందుకు వారిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed