ఈసీ ఆఫీసు వద్ద ఎంపీల నిరసన.. ఏమైందంటే..

by Hajipasha |
ఈసీ ఆఫీసు వద్ద ఎంపీల నిరసన.. ఏమైందంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్ఐఏలకు చీఫ్‌లను మార్చడంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పడాన్ని ఆపాలంటూ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు ధర్నాకు దిగారు. సోమవారం ఉదయం వారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయి బెంచ్‌తో సమావేశమయ్యే అవకాశాన్ని కల్పించాలని వారు కోరారు. అయితే ఈసీ అధికారులు అందుకు అవకాశం లేదని చెప్పారు. దీంతో టీఎంసీ రాజ్యసభా పక్ష నేత డెరెక్ ఓబ్రెయిన్ సారథ్యంలోని 10 మంది నాయకుల టీమ్ ఈసీ కార్యాలయం వద్దే బైఠాయించింది. ఎంత సర్దిచెప్పినా వినిపించుకోకపోవడంతో పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ప్రత్యేక వాహనంలోకి ఎక్కించారు. టీఎంసీ ఎంపీలను మందిర్ మార్గ్ పోలీసు స్టేషనుకు తరలించారు. ఆ పోలీసు స్టేషనులోనూ తమ నాయకులు 24 గంటల ధర్నాను కొనసాగిస్తారని తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఎప్పుడో 2022 నాటి కేసును తిరగదోడి.. 2024లో ఎన్నికల టైంలో ఎన్‌ఐఏ అరెస్టులు చేస్తుండటం విడ్డూరంగా ఉందని తృణమూల్ ఎంపీ డోలా సేన్ ఈ నిరసన సందర్భంగా ఆరోపించారు. నిరసన తెలిపిన టీఎంసీ ఎంపీలలో డోలా సేన్, సాగరికా ఘోష్, సాకేత్ గోఖలే, శంతను సేన్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed