పాశ్చాత్య దేశాల కంటే ముందే భారత్‌లో ప్రజాస్వామిక భావన.. రాష్ట్రపతి రిపబ్లిక్ డే సందేశం

by Hajipasha |   ( Updated:2024-01-25 16:25:01.0  )
పాశ్చాత్య దేశాల కంటే ముందే భారత్‌లో ప్రజాస్వామిక భావన.. రాష్ట్రపతి రిపబ్లిక్ డే సందేశం
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రజాస్వామిక భావన అనేది పాశ్చాత్య దేశాల కంటే ముందు నుంచే భారత్‌లో ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని ఆమె పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ‘‘ప్రస్తుతం మన దేశం అమృత్ కాల్ ప్రారంభ సంవత్సరాల్లో ఉంది. మార్పుకు పునాది పడుతున్న వేళ ఇది. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మనకు గొప్ప అవకాశం దక్కింది. దేశపు లక్ష్యాలను సాధించడానికి ప్రతి పౌరుడి సహకారం కీలకం’’ అని ఆమె పిలుపునిచ్చారు. ‘‘గత కొన్నేళ్లుగా ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు ధీటుగా భారత్ పురోగమిస్తోంది. భారత్ జీడీపీ వృద్ధి రేటు అత్యధికంగా ఉంది. ఇకపైనా ఇదే ధోరణి కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం’’ అని ముర్ము చెప్పారు. సంక్షేమ పథకాలు, ప్రజా సంక్షేమ ప్రణాళికల అమలులో కొత్త పంథాను భారత ప్రభుత్వం పరిచయం చేసిందన్నారు.

లింగ సమానత్వం దిశగా ముందడుగు..

చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడంతో లింగ సమానత్వం దిశగా భారత్ మరింత పురోగమించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశ పాలనలో మహిళల పాత్రను పెంచే వైపుగా దీన్ని కీలకమైన అడుగుగా అభివర్ణించారు. మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపికైన బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. ‘‘అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను విస్తృత దృక్కోణం నుంచి చూసినప్పుడు.. భవిష్యత్ చరిత్రకారులు భారతదేశపు నాగరికతా వారసత్వాన్ని తిరిగి కనుగొనేందుకు అదొక మైలురాయిగా నిలుస్తుంది’’ అని ఆమె చెప్పారు. “పూర్తి న్యాయ ప్రక్రియ తర్వాతే అయోధ్య రామాలయ నిర్మాణం జరిగింది. ఇది దేశ ప్రజల విశ్వాసానికి తగిన వ్యక్తీకరణను అందిస్తుంది. న్యాయ ప్రక్రియపై దేశ ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకానికి రామమందిరం గొప్ప నిదర్శనం’’ అని రాష్ట్రపతి తెలిపారు.

దైనందిన జీవితంలో భాగమవుతున్న ఏఐ, ఎంఎంల్

‘‘ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతిక పురోగతులు మన దైనందిన జీవితంలో భాగమవుతున్నాయి. యువత కొత్త సరిహద్దులను అన్వేషిస్తోంది. యువత మార్గం నుంచి అడ్డంకులను తొలగించడానికి, వారి పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు మనం చేయగలిగినదంతా చేయాలి’’ అని ముర్ము పేర్కొన్నారు. చంద్రయాన్ మిషన్, సోలార్ ఎక్స్‌ప్లోరర్ ఆదిత్య ఎల్1, ఎక్స్‌పోశాట్, గగన్‌యాన్‌ మిషన్‌‌కు సంబంధించిన ప్రయోగాల ద్వారా శాస్త్ర ప్రపంచంలో భారత్ దూసుకుపోతోందని తెలిపారు. త్వరలో జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story