కేంద్ర దర్యాప్తు సంస్థలపై సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

by Hajipasha |   ( Updated:2024-04-01 15:15:25.0  )
కేంద్ర దర్యాప్తు సంస్థలపై సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలపై భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విస్తరణ జరగాల్సినంతగా జరగలేదని.. ఫలితంగా అవి జాతీయ భద్రత, దేశ వ్యతిరేక నేరాలతో ముడిపడిన కేసులకే ప్రయారిటీ ఇచ్చి, వాటికే పరిమితం కావాల్సి వస్తోందన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల్లోని అధికారుల్లో ఎక్కువ మంది డిప్యూటేషన్‌‌పై పనిచేస్తున్న వారేనని సీజేఐ చెప్పారు. ‘సీబీఐ రైజింగ్ డే’ సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన 20వ డి.పి.కొహ్లీ మెమోరియల్ లెక్చర్ కార్యక్రమానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్లిష్టమైన కేసులను ఛేదించడానికి దర్యాప్తు సంస్థలు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. ఎఫ్‌ఐఆర్ నుంచి మొదలుకొని కేసు తుది దశ వరకు ప్రతీ ప్రాసెస్‌ను డిజిటలైజ్ చేయడం మంచిదన్నారు. భారీగా పేరుకుపోతున్న కోర్టు కేసుల పరిష్కారానికి సాంకేతికతను వాడుకోవాల్సిన అవసరం ఉందని సీజేఐ పేర్కొన్నారు. పోలీసులు, న్యాయ వ్యవస్థ, జైళ్ల వ్యవస్థ, ఫోరెన్సిక్ ల్యాబ్స్ కలిసికట్టుగా వర్క్‌షాప్‌లను నిర్వహించుకొని పరస్పర సమన్వయాన్ని, అవగాహనను పెంచుకోవాలని చెప్పారు. నేర దర్యాప్తులో ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్‌ను వాడుకుంటే చాలా వేగంగా కేసులను పరిష్కరించేందుకు తలుపులు తెరుచుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed