Prashant Kishore: త్వరలో కేసీఆర్ బీహార్ టూర్? పీకే వ్యాఖ్యల వెనుక అర్థం ఇదేనా?

by Nagaya |   ( Updated:2022-08-10 10:51:32.0  )
Prashant Kishor Comments On Bihar Politics
X

దిశ, వెబ్‌డెస్క్ : Prashant Kishor Comments On Bihar Politics| బీహార్‌లో నెలకొన్న రాజకీయ డ్రామాపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత సౌకర్యంగా కనిపించలేదని అందువల్లే ఆయన ఒక రాజకీయ కూటమి నుండి మరో కూటమికి మారిపోయారని అన్నారు. ఒకప్పుడు నితీష్ కుమార్‌కు సన్నిహితుడిగా పేరున్న పీకే.. బుధవారం పాట్నాలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల ప్రభావం ప్రస్తుతం బీహార్‌కే పరిమితమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మార్పు జాతీయ స్థాయిలో ప్రభావం చూపకపోవచ్చని అన్నారు.

నితీష్ కుమార్ 2017 నుంచి 2022 వరకు బీజేపీలోనే ఉన్నారని, కాని బీజేపీ కూటమితో నితీష్ కుమార్ ఎప్పుడు సంతోషంగా కనిపించలేదని అన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. తాజాగా ఆర్జేడీతో కలవాలనుకోవడం వెనుక మహాఘట్‌బంధన్‌‌తో ప్రయోగాలు చేద్దాం అనే ఉద్దేశం నితీష్‌లో ఉండి ఉండవచ్చని అన్నారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన నితీష్ రానున్న ఎన్నికల్లో ప్రధాన మంత్రి రేస్‌లో ఉంటారని ఆ దిశగా చేసే ప్రయత్నంలో భాగంగానే తాజాగా కూటమి నుండి బయటకు వచ్చారా అనే అంశంపై పీకే స్పందించారు. తాజా పరిణామాలు ఖచ్చితంగా బీహార్ వరకే పరిమితం అవుతాయని స్పష్టం చేశారు. 2012-13 నుంచి బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆరు ప్రయోగాలు జరిగాయని వీటన్నింటిలోనూ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సీఎంగా స్థిరంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వాలు మారినా బీహార్‌లో పరిస్థితిలో ఎలాంటి మార్పు జరగలేదని, కొత్త ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తుందేమో చూడాలన్నారు.

బీహార్ పరిణామాలపై కేసీఆర్ నజర్

బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ పార్టీ గుడ్‌బై చెప్పడం ఆ వెంటనే మహాఘట్‌బంధన్‌తో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు పరిశీలిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ బీహార్ వేదికగా సాగుతున్న పొలిటికల్ డ్రామా పై ఆయన దృష్టి పడినట్లు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా తాను చేస్తున్న ప్రయత్నాలకు బీహార్ తాజా పరిణామాలు బలం చేకూర్చుతాయనే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నారట. గతంలో పీకేతో నితీష్ కుమార్‌తో స్నేహం ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌కు ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.

పీకే తనకు మంచి మిత్రుడని, చాలా కాలంగా తాము కలిసి పని చేస్తున్నామని కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీట్‌లో బహిరంగంగానే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రాబోయే రోజుల్లో బీజేపీకి వ్యతిరేక కూటమికి కావాల్సిన మద్దతు నితీష్ కుమార్ నుండి సైతం లభిస్తుందనే ఆశాభావంతో కేసీఆర్ ఉన్నట్లు చర్చ సాగుతోంది. బీహార్ కొత్త ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు కేసీఆర్‌కు మధ్య గతంలో చర్చలు జరిగిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో నితీష్ కుమార్ సైతం తమకు సహకరిస్తారనే అభిప్రాయాలు టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలో కేసీఆర్ నార్త్ ఇండియా టూర్ మరోసారి పెట్టుకోబోతున్నారని ముఖ్యంగా బీహార్‌లో ఆయన పర్యటించి జాతీయ స్థాయి రాజకీయాలపై మరోసారి కసరత్తు ప్రారంభించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.

పీకే వ్యాఖ్యల వెనుక అర్థం ఇదేనా?

ఇదిలా ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా బీహార్‌లో మొదలైన పొలిటికల్ గేమ్ రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బగా మారుతుందని, ప్రధాన మంత్రి పదవికి ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నితీష్ కుమార్ ఉండబోతున్నారనే టాక్ జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్‌కు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ ప్రెస్ మీట్ పెట్టడం నితీష్ కేవలం బీహార్‌కే పరిమితం అవ్వబోతున్నారని జోస్యం చెప్పటం వెనుక రాజకీయంగా ఊహాగానాలకు తావిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తుంటే నితీష్ కుమార్ ప్రధాన మంత్రి అభ్యర్థి అనే చర్చ జరగడంపై కేసీఆర్ ఆలోచనల్లో పడ్డారని, నితీష్ కుమార్‌పై జరుగుతున్న చర్చను డైవర్ట్ చేయడానికే పీకే తాజా వ్యాఖ్యలు చేశారనే ప్రచారం తెరపైకి వస్తోంది. మొత్తంగా బీహార్ లో చోటు చేసుకున్న తాజా రాజకీయ మలుపు దేశ రాజకీయాల్లో కొత్త కొత్త చర్చలకు కారణం అవుతుంది. ఈ రాజకీయ క్రీడలో ఎవరు ఎటు వైపు అనేది రాబోయే రోజుల్లో తేలనుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఫార్మా కంపెనీల కోసం ప్రభుత్వం భూములు గుంజుకుంటుర్రు.. బండికి బాధితుల మొర

Advertisement

Next Story