ప్రజ్వల్ రేవణ్ణ కేసులో మరో ట్విస్ట్.. మాట మార్చిన బాధితురాలు

by Hajipasha |
ప్రజ్వల్ రేవణ్ణ కేసులో మరో ట్విస్ట్.. మాట మార్చిన బాధితురాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలను వైరల్ వీడియోలు కుదిపేస్తున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలు ఇప్పటిదాకా దుమారం రేపగా..ఇప్పుడు బాధితులు మాట మార్చిన వీడియోలు వైరల్ కావడం మొదలైంది. దీన్నిబట్టి ఈ కేసు స్వరూపం ఎంత వేగంగా మారుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో పనిచేసిన 60 ఏళ్ల మహిళపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు గతంలో వచ్చాయి. ఆ మహిళను వేధిస్తున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇది జరిగిన వెంటనే ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ రంగంలోకి దిగి.. సతీష్‌ బాబన్న అనే అనుచరుడిని పంపించి సదరు మహిళను కిడ్నాప్ చేయించాడని కర్ణాటక పోలీసులు చెబుతూ వచ్చారు. వారం క్రితమే మైసూరు జిల్లాలోని హున్‌సూరులో హెచ్‌డీ రేవణ్ణ సహాయకుడి ఇంటి నుంచి ఆ మహిళను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విడిపించింది. మరోవైపు తన తల్లిని హెచ్‌డీ రేవణ్ణ కిడ్నాప్ చేయించాడంటూ సదరు మహిళ కుమారుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ మహిళ ఇప్పుడు మాట మార్చింది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇబ్బందిపెట్టలేదని ఆమె చెబుతున్నట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది. బాధలో ఏం చేయాలో అర్థం కాక తన కుమారుడు కిడ్నాప్ కేసు పెట్టి ఉంటాడని ఆమె పేర్కొంది. ‘‘నేను ఎవరి నుంచి కూడా సమస్యలను ఎదుర్కోలేదు. అది భవానీ రేవణ్ణ కావచ్చు.. హెచ్‌డీ రేవణ్ణ కావచ్చు.. ప్రజ్వల్ రేవణ్ణ కావచ్చు’’ అని బాధితురాలు తాజా వీడియోలో స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed