సిట్ ముందు హాజరవుతానంటూ వీడియో విడుదల చేసిన ప్రజ్వల్ రేవణ్ణ

by S Gopi |
సిట్ ముందు హాజరవుతానంటూ వీడియో విడుదల చేసిన ప్రజ్వల్ రేవణ్ణ
X

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక దౌర్జన్యాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన జేడీ(ఎస్) నేత, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 31న ఉదయం 10 గంటలకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ముందు హాజరు కానున్నట్టు ఒక ప్రైవేట్ వీడియోను విడుదల చేశాడు. ఏప్రిల్ 26న జరిగిన కర్ణాటక లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ముందు ప్రజ్వల్‌ రేవణ్ణపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీయడంతో విదేశాలకు పారిపోయాడు. అప్పటి నుంచి భారత్‌కు తిరిగిరాలేదు. ఈ నేపథ్యంలో అతనిపై పోలీసులు అరెస్ట్‌ వారెంట్‌ కూడా జారీ చేశారు. మరోవైపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ప్రజ్వల్‌ రేవణ్ణకు కుటుంబ సభ్యులు హెచ్చరించినప్పటికీ స్పందించలేదు. తాజాగా దర్యాప్తు సంస్థ సిట్‌ ముందు విచారణకు హాజరవుతానంటూ వీడియో రిలీజ్ చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలతో తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష నాయకుల వ్యాఖ్యలు పొలిటికల్ డ్రామా అని ఆరోపించాడు. 'నేను నా తల్లిదండ్రులకు, జేడీ(ఎస్) నాయకులు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెబుతున్నాను. ఇటీవల పరిణామాలతో డిప్రెషన్‌లో ఉన్నాను. నేను తిరిగి భారత్‌కు వచ్చి మే 31 సిట్ ముందు హాజరవుతాను' అని రేవణ్ణ తన వీడియో సందేశంలో చెప్పాడు. నేను నా శక్తి మేరకు సహకరిస్తాను. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నాపై ఉన్న ఈ తప్పుడు కేసుల నుంచి బయటకు వస్తాను. నాకు భగవంతుడు, నా కుటుంబం ఆశీర్వాదం ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed