గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ వేధింపుల ఆరోపణలపై విచారణ బృందం ఏర్పాటు

by Disha Web Desk 17 |
గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ వేధింపుల ఆరోపణలపై విచారణ బృందం ఏర్పాటు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌, ఓ మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు రాగా దేశ రాజకీయాల్లో ఇది సంచలనం సృష్టిస్తుంది. దీంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు సాక్షులతో మాట్లాడి అన్ని వివరాలను సేకరించనున్నారు. కోల్‌కతా పోలీస్ సెంట్రల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఇందిరా ముఖర్జీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, విచారణ బృందాన్ని ఏర్పాటు చేశాం. రాబోయే కొద్ది రోజుల్లో కీలకమైన సాక్షులతో మాట్లాడి, వారి వాంగ్మూలాలను తీసుకుంటాం, అలాగే CCTV ఫుటేజీ కోసం అభ్యర్థించినట్లు తెలిపారు.

ఇటీవల కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసే ఒక మహిళా గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఆశ చూపించి తనపై పలుమార్లు లైంగికంగా వేధించారని ఆ మహిళ పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ మహిళ చేసిన ఆరోపణలను గవర్నర్ ఆనంద బోస్‌ ఖండించారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సత్యం గెలుస్తుందని అన్నారు.

అయితే ఒక గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో లోక్‌సభ ఎన్నికల వేళ ఇది రాజకీయంగా తీవ్రదుమారం లేపింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సంఘటనను "తీవ్ర బాధ కలిగించేది" అని అభివర్ణించారు. సందేశ్‌ఖాలీ ఘటన సమయంలో గొప్పగా మాట్లాడిన అదే గవర్నర్, ఇప్పుడు రాజ్ భవన్‌లో మహిళా సిబ్బందిని వేధించినందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

Next Story

Most Viewed