పీఎంకే కార్యకర్తపై కత్తులతో దాడి.. బీఎస్పీ చీఫ్ తరహలోనే..

by Shamantha N |
పీఎంకే కార్యకర్తపై కత్తులతో దాడి.. బీఎస్పీ చీఫ్ తరహలోనే..
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య రాజకీయంగా దుమారం రేగింది. ఆ హత్య మరువకముందే.. అదే తరహాలో మరో దాడి జరిగింది. కడలూర్‌లో పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) కార్యకర్త శివశంకర్ పై నలుగురు దుండగులు కత్తితో దాడిచేశారు. తిరుపాపులియూర్ లోని శివశంకర్ ఇంటిముందే.. బైక్ పై వచ్చిన దుండగులు ఆయన్ని పొడిచారు. శివశంకర్ మెడ, నోరు, భుజానికి గాయాలయ్యాయి. ప్రస్తుతం శివశంకర్ పరిస్థితి విషమంగా ఉందని.. జిప్మర్ కు ఆయన్ని తరలించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సమీపంలోని సీసీటీవీలో దుండగులు కత్తులతో పరిగెత్తుతున్న వీడియోలు రికార్డయ్యాయి. వన్నియార్ సంఘం నాయకుడు కూడా అయిన శివశంకర్‌పై దాడి చేసిన కేసులో మైనర్ సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

పీఎంకే అధినేత ఆగ్రహం

ఇకపోతే, అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఈదాడిని రామదాస్ ఖండించారు. ఈ దాడికి తమిళనాడు పోలీసుల వైఫల్యమే కారణమని ఆరోపించారు.‘‘శంకర్ సోదరుడు ప్రభు హత్య మూడేళ్ల క్రితం జరిగింది. ఈ కేసులో శంకర్ ప్రధాన సాక్షిగా ఉన్నాడు. ఆయన్ని కోర్టుకి హాజరుకావద్దని ముఠా బెదిరించింది. తనను బెదిరించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శంకర్‌కు రక్షణ కల్పించలేదు. అందువల్లే, క్రూరమైన హత్యాయత్నానికి దారితీసింది. ఇది పోలీసుల అలసత్వానికి, అసమర్థతకు నిదర్శనం” అని రామదాస్ అన్నారు. ఈ మధ్య కాలంలో చెన్నై నుంచి తిరునెల్వేలి వరకు ఇలాంటి హత్యలు ఎక్కువయ్యాయని ఫైర్ అయ్యారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు.

చెన్నై పోలీస్ కమీషనర్ బదిలీ

బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్య కేసులో తమిళనాడు ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఈనెల 5న చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలోని ఆర్మ్ స్ట్రాంగ్ హత్య జరిగింది. చెన్నై పోలీసు కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ అధికారి అరుణ్‌ను చెన్నై సీపీగా నియమించారు. ఇకపోతే, సందీప్ రాయ్ రాథోడ్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి ఇన్ ఛార్జ్ డీజీపీగా బదిలీ అయ్యారు. అరుణ్.. ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్నారు. కాగా.. ఆయన స్థానంలో ఎస్ డేవిడ్ సన్ దేవాశీర్వాదాన్ని నియమించినట్లు తమిళనాడు హోంశాఖ తెలిపింది.

Advertisement

Next Story