బీజేపీ సీఈసీ కీలక భేటీ.. నేడో, రేపో అభ్యర్థులపై ప్రకటన

by Hajipasha |   ( Updated:2024-02-29 18:46:15.0  )
బీజేపీ సీఈసీ కీలక భేటీ..  నేడో, రేపో అభ్యర్థులపై ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈసారి ఎన్నికలకు సాధ్యమైనంత త్వరగా.. ఇండియా కూటమి కంటే ముందే లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ అయింది. పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ సహా సీనియర్ నేతలు పాల్గొన్న ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. దేశంలోని 550కిపైగా లోక్‌సభ స్థానాల కోసం ముగ్గురు చొప్పున అత్యుత్తమ అభ్యర్థుల పేర్లతో రూపొందించిన లిస్టుపై ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. తొలి విడతగా నేడో రేపో లోక్‌సభ అభ్యర్థుల పేర్లతో ఒక జాబితాను రిలీజ్ చేస్తారని సమాచారం. మార్చి 10లోగా 50 శాతానికిపైగా లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, తెలంగాణ, రాజస్థాన్‌, గోవా, గుజరాత్‌ తదితర రాష్ట్రాల లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లపై గురువారం రాత్రి జరిగిన బీజేపీ సమావేశంలో ప్రధాన చర్చ జరిగింది. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల అభ్యర్థుల నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. పంజాబ్‌లో అకాలీదళ్, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, జనసేన, తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed