రూ. 9,800 కోట్ల విలువైన 15 విమానాశ్రయ ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోడీ

by S Gopi |
రూ. 9,800 కోట్ల విలువైన 15 విమానాశ్రయ ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లో రూ. 9,800 కోట్ల విలువైన 15 విమానాశ్రయ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో 12 కొత్త టర్మినల్ భవనాలు కూడా ఉన్నాయి. అజంగఢ్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో మోడీ.. పూణె, కొల్హాపూర్, గ్వాలియర్, జబల్‌పూర్, ఢిల్లీ, లక్నో, అలీగఢ్, అజంగఢ్, చిత్రకూట్, మొరాదాబాద్ విమానాశ్రయాల్లో కొత్త టర్మినల్ భవనాలు ప్రారంభించారు. ఇవి కాకుండా అజంగఢ్‌లోని మహారాజా సుహెల్‌దేవ్ స్టేట్ యూనివర్శిటీని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ, ఈ ప్రారంభోత్సవాలను రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్టితో చూడొద్దని, 2047 నాటికి అభివృద్ధి చెందే దేశ ప్రయాణంలో భాగంగా చూడాలన్నారు. 'ఆధునిక మౌలిక సదుపాయాల పనులు చిన్న నగరాలకు కూడా విస్తరించాలి. మెట్రో నగరాల తరహాలోనే చిన్న నగరాలు కూడా అభివృద్ధి చెందాలి. తాము ప్రణాళిక ప్రకారం టైర్2, టైర్2 నగరాలను అభివృద్ధి చేస్తున్నట్టు, ఇది సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌కు నిరదర్శనమని' పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ.. కడప, హుబ్లీ, బెళగావి విమానాశ్రయాల్లో కొత్త టెర్మినల్ భవనాలకు కూడా వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఏఏఐ రూ.908 కోట్లతో ఈ మూడు టెర్మినల్ భవనాల అభివృద్ధిని చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు డిప్యూటీ సీఎం ప్రసాద్ మౌర్య, ఇతర నేతలు పాల్గొన్నారు.

Advertisement

Next Story