PM Modi : రూ.83వేల కోట్లు విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం

by Hajipasha |
PM Modi : రూ.83వేల కోట్లు విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశ ప్రజల సంక్షేమం, వికాసం కోసం తమ ప్రభుత్వం రాజీలేని కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. జార్ఖండ్‌ను పురోగతిలోకి తెచ్చేందుకు, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో రూ.83,300 కోట్లకుపైగా విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టుల పనులను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం ఆవాస్ యోజన పథకం వల్ల జార్ఖండ్‌‌కు చెందిన ఎంతోమంది పేదలు సొంతింటి కలను నెరవేర్చుకున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు.

కొత్త అభివృద్ధి ప్రాజెక్టుల పనులు పూర్తయితే రాష్ట్రం వికాసం మరింత వేగవంతం అవుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన వర్గాలకు విద్యా అవకాశాలను పెంచే లక్ష్యంతో జార్ఖండ్‌లో ఏర్పాటు చేయనున్న 40 ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలను మోడీ ప్రారంభించారు. రూ..2,800 కోట్లతో మరో 25 ఏకలవ్య పాఠశాలల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.79,150 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ధర్తీ ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని కూడా ఈసందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభించారు.

Next Story

Most Viewed