ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ.. రెండు దేశాల టూర్ సక్సెస్

by Hajipasha |
ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ.. రెండు దేశాల టూర్ సక్సెస్
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ యూఏఈ, ఖతర్ దేశాల మూడు రోజుల పర్యటనను ముగించుకొని గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఖతర్ రాజధాని దోహా నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన మోడీ.. మూడు గంటల్లో ఢిల్లీలో ల్యాండయ్యారు. గత పదేళ్లలో భారత ప్రధానమంత్రి యూఏఈలో ఏడుసార్లు, ఖతర్‌లో రెండుసార్లు పర్యటించారు. ఖతర్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని మోడీ ఖతర్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. గూఢచర్యం కేసులో అరెస్టయిన 8 మంది భారత మాజీ నేవీ సిబ్బందిని జైలు నుంచి విడుదల చేసినందుకుగానూ ఈసందర్భంగా ఖతర్ రాజుకు భారత ప్రధాని కృతజ్ఞతలు తెలిపారన్నారు. భారత పర్యటనకు రావాల్సిందిగా ఖతర్ రాజును ఈసందర్భంగా మోడీ ఆహ్వానించారని ఆయన చెప్పారు. అంతకుముందు గురువారం ఉదయం ఖతర్ రాజధాని దోహాకు చేరుకున్న ప్రధాని మోడీకి బస చేసే హోటల్ వెలుపల ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు.త్రివర్ణ పతాకం, బహుమతులు పట్టుకున్న ఎన్ఆర్‌ఐలు మోడీని చూసిన వెంటనే.. ఆయన పేరును, భారత్ మాతా కీ జై నినాదాలను హోరెత్తించారు. అనంతరం ఖతర్ ప్రధానమంత్రి ఏర్పాటుచేసిన విందులో భారత ప్రధాని మోడీ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed