కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా పిటిషన్: తిరస్కరించిన సుప్రీంకోర్టు

by samatah |
కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా పిటిషన్: తిరస్కరించిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలు తర్వాత వాటి పనితీరును పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తులు బేలా ఎం త్రివేది, పంకజ్ మిథాల్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతిచ్చింది. ఈ చట్టాలు ఇప్పటి వరకు అమలులోకి రాలేదని, అప్పుడే వీటిపైన కమిటీ ఎలా వేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. అప్పీల్ చేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పిటిషనర్‌పై మండిపడింది. దీనిపై ఎక్కువగా వాదిస్తే జరిమానా కూడా విధించే అవకాశం ఉండేదని స్పష్టం చేసింది. పిటిషన్‌ను స్వీకరించడానికి కోర్టు విముఖత చూపడంతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

మూడు కొత్త చట్టాల అమలుపై స్టే విధించాలని కోరుతూ న్యాయ వాది విశాల్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. చాలా మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్‌లో ఉన్నందున చర్చ లేకుండానే ఈ బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించారని పేర్కొన్నారు. మూడు కొత్త క్రిమినల్ చట్టాల సాధ్యతను అంచనా వేసే నిపుణుల కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ‘కొత్త క్రిమినల్ చట్టాలు చాలా క్రూరమైనవి. భారతదేశ ప్రజల ప్రాథమిక హక్కుల ప్రతి నిబంధనను ఉల్లంఘించాయి’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దానిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది.

కాగా, మూడు క్రిమినల్ చట్టాలు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను గత ఏడాది డిసెంబర్ 21న పార్లమెంట్‌ ఆమోదించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 25న దీనికి ఆమోదం తెలిపారు. ఈ ఏదాడి జూలై 1 నుంచి ఈ చట్టాలు అమలులోకి వస్తాయని కేంద్ర తెలిపింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 24న రిలీజ్ చేసింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పలు సెక్షన్లలో మార్పులు రానున్నాయి.

Advertisement

Next Story