PMAYG: ఇళ్ల నిర్మాణ పథకంలో కేంద్రం వాటా ఎంత?.. ఎంత పెంచాలని సిఫారసులు వచ్చాయి?

by Mahesh Kanagandla |
PMAYG: ఇళ్ల నిర్మాణ పథకంలో కేంద్రం వాటా ఎంత?.. ఎంత పెంచాలని సిఫారసులు వచ్చాయి?
X

దిశ, నేషనల్ బ్యూరో: మన దేశంలో గూడులేకపోవడం ప్రధాన సమస్యగా ఉన్నది. పేదరికం, నిరుద్యోగంతో ఈ సమస్య మరింత జఠిలమవుతున్నది. అందుకే కోట్లాది కుటుంబాలకు సొంతింటి కల.. కలగానే మిగిలిపోతున్నది. ఈ క్రమంలోనే సొంతిల్లు నిర్మించుకోవడానికి పేదలకు ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రత్యేకంగా పథకాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు పథకం తరహా పలు రాష్ట్రాలు ఇంటి నిర్మాణ పథకాలను అమలు చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనా(PMAY-G) పథకం ద్వారా లబ్దిదారులకు తన వంతు వాటాగా ఆర్థిక సహాయం అందిస్తున్నది. దేశంలో అందరికీ ఆవాసం ఉండాలనే లక్ష్యాన్ని పలుమార్లు నొక్కిచెప్పిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకాన్ని గతేడాది మరో ఐదేళ్లు పొడిగించింది. అయితే.. ఈ పథకం అమలులో లోపాలున్నాయని రూరల్ డెవలప్‌మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి నివేదికను సమర్పించింది. ఈ రిపోర్టును బుధవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

2011 లెక్కల ఆధారంగా ఎంపిక

గ్రామీణంలో ఆవాస పథకం(Rural Housing Scheme) అమలులో లోపాలు ఉన్నాయని, వాస్తవ లబ్దిదారుల ఎంపికలో ప్రభుత్వం విఫలమవుతున్నదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. 2011లోని సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్(ఎస్ఈసీసీ) లెక్కల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక జరుగుతున్నదని, 14 ఏళ్ల కాలం గడిచిన మూలంగా అనేక మార్పులు, చేర్పులు జరిగాయని వివరించింది. ఫలితంగా అప్పుడు లబ్దిదారులుగా ఉన్నవారు.. నేడు లబ్దిదారులుగా లేకపోవచ్చునని, ఇక లబ్దిదారులుగా అన్ని అర్హతలున్న ఎన్నో కుటుంబాలు పథక ఫలాల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపింది. ఇది పెద్ద లోపంగా ఉన్నదని, గ్రామీణాభివృద్ధి శాఖ 2011 ఎస్ఈసీసీలో నమోదు చేసుకోని అర్హులను గుర్తించి జాబితా రూపొందించే పని పెట్టుకోవాలని సూచించింది. గోడలు నిర్మించి ఆగిన ఇళ్లు, ఇనుప రేకులున్న ఇళ్లు వంటి పాక్షిక నిర్మాణాలనూ గుర్తించి వారికీ పథకాన్ని విస్తరించే ఆలోచనలు చేయాలని సిఫారసు చేసింది. కాగా, 2018లో ప్రభుత్వం ఆవాస్+ సర్వే చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

పీఎంఏవై కింద ఇచ్చేది రూ. 1.20 లక్షలు

పీఎంఏవై కింద కేంద్ర ప్రభుత్వం రూ. 1.20 లక్షలు లబ్దిదారులకు అందిస్తున్నది. మైదాన ప్రాంతాల్లో ఈ మొత్తం అందిస్తుండగా.. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్ వంటి కొండప్రాంతాల్లో ఈ మొత్తం రూ. 1.30 లక్షలుగా ఉన్నదని కమిటీ నివేదికలో వివరించింది. గతేడాది పథకాన్ని పొడిగించిన కేంద్రం.. ఆర్థిక సహాయాన్ని మాత్రం పెంచలేదని తెలిపింది. ముడి సరుకుల ధరలు పెరిగిపోవడం, ద్రవ్యో్ల్బణం కారణంగా రూపాయి విలువ పడిపోవడం వంటి అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న అర్హులు.. ఇంతటి స్వల్ప మొత్తంతో నాణ్యమైన ఇంటిని నిర్మించుకోవడం సాధ్యం కాదని తెలిపింది. కాబట్టి, కేంద్రం ఈ పథకం కింద అందించే ఆర్థిక సహాయాన్ని రూ. 4 లక్షలకు పెంచాలని సిఫారసు చేసింది.

కొత్తగా 53 లక్షల ఇళ్లేనా?

2024 అక్టోబర్ 22వ తేదీ వరకు ఈ పథకం కింద కేంద్రం 2.66 కోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసింది. కాగా, పొడిగించిన గడువులో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణాలకు సహాయం అందిస్తామని తెలిపింది. ఈ పథకం కింద ఇది వరకే బ్యాక్‌లాగ్‌గా 1,46,54,267 ఇళ్ల నిర్మాణాలున్నాయి. ఇందులో 62,54,267 ఎస్‌ఈసీసీ 2011 జాబితా నుంచి ఎంపికైనవారు.. ఆవాస్ + లిస్టు నుంచి సుమారు 84 లక్షల మంది అర్హులను గుర్తించారు. అంటే.. ప్రకటించిన రెండు కోట్ల ఇళ్లల్లో బ్యాక్‌లాగ్ కిందే 1.46 కోట్ల ఇళ్లు పోగా.. కొత్తగా సుమారు 53.45 లక్షల ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే కేంద్రం సహాయం అందించే అవకాశముంది.

Advertisement
Next Story

Most Viewed