Waqf Bill : వక్ఫ్ బిల్లుపై జేపీసీ సమావేశం.. బహిష్కరించిన విపక్ష ఎంపీలు

by Hajipasha |
Waqf Bill : వక్ఫ్ బిల్లుపై జేపీసీ సమావేశం.. బహిష్కరించిన విపక్ష ఎంపీలు
X

దిశ, నేషనల్ బ్యూరో : వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశాన్ని విపక్ష పార్టీల ఎంపీలు సోమవారం బహిష్కరించారు. ఈ సమావేశంలో కర్ణాటక మైనారిటీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ అన్వర్ మనిప్పాడి ప్రజెంటేషన్‌ను విపక్ష ఎంపీలు తప్పుపట్టారు. ఆయన వక్ఫ్ సవరణ బిల్లు విషయాన్ని వదిలేసి.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేలను విమర్శించడానికే పరిమితమయ్యారని మండిపడ్డారు. సరైన విధివిధానాల ప్రకారం జేపీసీ సమావేశం జరగనందున తాము బహిష్కరించామని శివసేన (యూబీటీ) ఎంపీ అర్వింద్ సావంత్ తెలిపారు. వక్ఫ్ బిల్లుపై జేపీసీ సమావేశాలు జరుగుతున్న తీరు గురించి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని విపక్ష ఎంపీలు నిర్ణయించారు.

అంతకుముందు అడ్వకేట్ విష్ణుశంకర్ జైన్, ఆయన తండ్రి హరిశంకర్ జైన్‌లు పార్లమెంటు భవనంలో జేపీసీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. వక్ఫ్ సవరణ బిల్లును ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అక్కడ వాడివేడి చర్చ జరిగిన అనంతరం జేపీసీ పరిశీలనకు పంపారు. అక్టోబరు 1 నుంచి ఈ బిల్లుపై వివిధ పక్షాల అభిప్రాయాలను జేపీసీ సేకరిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 6 లక్షల రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నట్లు అంచనా. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు 1995లో వక్ఫ్ చట్టాన్ని రూపొందించారు. ఇప్పుడు దాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Next Story

Most Viewed