'ప్రస్తుత పరిస్థితులకు అవసరం లేదనే.. పీరియాడిక్ టేబుల్‌ తొలగింపు'

by Vinod kumar |
ప్రస్తుత పరిస్థితులకు అవసరం లేదనే.. పీరియాడిక్ టేబుల్‌ తొలగింపు
X

న్యూఢిల్లీ: పదో తరగతి సైన్స్‌ సిలబస్‌ నుంచి పీరియాడిక్‌ టేబుల్‌ను తొలగించిన అంశంపై తీవ్ర చర్చ రేగడంతో.. దానిపై ఎన్‌సీఈఆర్‌టీ శుక్రవారం వివరణ ఇచ్చింది. కొవిడ్ సమయంలో టెన్త్ విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. వారిపై భారం పడకూడదన్న ఉద్దేశంతోనే సిలబస్‌ను దశల వారీగా హేతుబద్ధీకరిస్తున్నామని తెలిపింది. అందులో భాగంగానే మరిన్ని లెస్సన్స్‌ను తొలగించామని ఎన్‌సీఈఆర్‌టీ స్పష్టం చేసింది. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కరికులమ్‌ నుంచి పీరియాడిక్‌ టేబుల్‌ ను పూర్తిగా తొలగించలేదని.. 11, 12వ తరగతి సైన్స్‌ సబ్జెక్టుల్లో ఈ సమాచారం ఉంటుందని పేర్కొంది.

ఎన్‌సీఈఆర్‌టీ ఫ్యాకల్టీ, సీబీఎస్‌ఈ ప్రాక్టీసింగ్‌ టీచర్లు, ఇతర నిపుణులతో చర్చించిన తర్వాతే పాఠ్యాంశాలను తొలగిస్తున్నామని తెలిపింది. ఒక క్లాసుకు చెందిన వేర్వేరు సబ్జెక్టుల్లో ఒకే కంటెంట్‌ ఉంటే దాన్ని తీసేస్తున్నామని చెప్పింది. అలాగే ఒక సబ్జెక్టులో కింది, పైతరగతుల్లో ఒకే విషయం ఉన్నా తొలగిస్తున్నామని.. ప్రస్తుత పరిస్థితులకు అవసరం లేని పాఠ్యాంశాలను తీసివేస్తున్నామని పేర్కొంది. ఇప్పుడు పీరియాడిక్‌ టేబుల్‌ తొలగింపు విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందని వివరించింది.

Advertisement

Next Story

Most Viewed