డీప్‌ఫేక్‌ వీడియోల పరిశీలనకు ప్రత్యేక అధికారి

by Aamani |
డీప్‌ఫేక్‌ వీడియోల పరిశీలనకు ప్రత్యేక అధికారి
X

న్యూఢిల్లీ: డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారంపై గురువారం కొత్త మార్గదర్శకాలను రూపొందించడంపై సోషల్ మీడియా, ఏఐ నిపుణులతో సమావేశం తర్వాత కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో డీప్‌ఫేక్‌ వీడియోలను పరిశీలించడానికి, కేసు దాఖలు చేయడంలో ప్రజలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ఓ అధికారిని నియమించనుంది. ఈ అంశానికి సంబంధించి సోషల్‌ మీడియా సంస్థలతో రెండు రోజుల కీలక సమావేశం నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

అటువంటి కంటెంట్‌పై చర్యలు తీసుకునే బాధ్యతలు కలిగిన అధికారిని నియమిస్తాం. ఏఐని ఉపయోగించి సృష్టించే డీప్‌ఫేక్ వీడియోలు అత్యంత ప్రమాదకరం. నకిలీ సమాచారం సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు కఠిన నిబంధనలు పాటించాలి, లేకపోతే చర్యలు తప్పవని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఐటీ చట్టం-2021 నిబంధనల ప్రకారం, నిర్దేశించిన సమయంలోపు లేదంటే రిపోర్టింగ్ చేసిన 36 గంటల్లోగా సదరు కంటెంట్‌ను తొలగించాలి. లేకపోతే కఠిన చర్యలు ఉంటాయి. డీప్‌ఫేక్ వీడియోలను సృష్టించడం, వ్యాప్తి చేయడంలో రుజువులుంటే రూ. లక్ష జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష అమలవుతుంది. డిజిటల్ స్పేస్‌లో దేశంలోని పౌరులకు భద్రత, నమ్మకాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Next Story