ఇక నుంచి కొత్త భవనమే పార్లమెంట్.. అధికారికంగా మారిన అడ్రస్

by GSrikanth |   ( Updated:2023-09-19 06:17:01.0  )
ఇక నుంచి కొత్త భవనమే పార్లమెంట్.. అధికారికంగా మారిన అడ్రస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘పార్లమెంట్ ఆఫ్ ఇండియా’ అనగానే ఇప్పటివరకూ మన మదిలో మెదిలిన వృత్తాకారంలో వెయ్యి స్తంభాలతో కూడిన భవనం కళ్ళముందు కదలాడుతుంది. కానీ, ఇకపైన కొత్త భవనమే అధికారికంగా పార్లమెంటుగా మారనున్నది. బ్రిటీషు కాలంలో 1921లో నిర్మాణం మొదలై 1927లో వినియోగంలోకి వచ్చిన పాత భవనం నుంచి పార్లమెంటు కార్యకలాపాలు లాంఛనంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి కొత్త భవనం (ప్లాట్ నెం. 118) లోకి మారుతున్నాయి. దీంతో ఇక నుంచి ‘పార్లమెంట్ ఆఫ్ ఇండియా’ అంటే కొత్త భవనమే అవుతుందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొన్నది. పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో ఉన్న భారత రాజ్యాంగం పుస్తకాన్ని స్వయంగా ప్రధాని మోడీ తన చేతుల మీదుగా కొత్త భవనంలోకి తీసెకెళ్ళి ఉంచనున్నారు. దీంతో కొత్త భవనమే అధికారికంగా పార్లమెంటుగా ఉనికిలోకి రానున్నది.

దాదాపు 90 ఏళ్ళుగా రైసినా హిల్స్ ప్రాంతంలో ఉన్న పార్లమెంటు పాత భవనం ఇకపైన మ్యూజియంగా మారనున్నది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నిన్నటివరకూ పార్లమెంటుగా కొనసాగిన ఈ భవనం దేశ ప్రజలకు సందర్శనా భవనంగా మిగిలిపోనున్నది. అనేకమైన కీలక చట్టాలకు, దేశ తలరాతను మార్చే నిర్ణయాలకు వేదికగా ఉన్న పాత భవనం తెలంగాణ, ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ లాంటి అనేక కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు వేదికగా నిలిచింది. ఇకపైన అదంతా గత చరిత్రగానే మిగిలిపోనున్నది.

Advertisement

Next Story

Most Viewed