Nurse Molested: నర్సు, మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. బెంగాల్‌లో వెలుగులోకి ఘటనలు

by vinod kumar |
Nurse Molested: నర్సు, మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. బెంగాల్‌లో వెలుగులోకి ఘటనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్ మెడికల్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య ఘటనతో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ రాష్ట్రంలో మరో రెండు లైంగిక వేధింపుల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బీర్‌భూమ్ జిల్లా ఇలంబజార్‌లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో డ్యూటీలో ఉన్న నర్సుపై ఓ రోగి వేధింపులకు పాల్పడ్డాడు. అలాగే హౌరా ఆస్పత్రిలో 13ఏళ్ల బాలికపై ల్యాబ్ టెక్నీషియన్ వేధింపులకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు శనివారం రాత్రి బీర్భూమ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యుల సలహా మేరకు రోగికి గ్లూకోజ్ పెడుతుండగా ఆయన నర్సుపై అనుచితంగా ప్రవర్తించారు. ప్రైవేటు బాగాలపై తాకుతూ అసభ్యకర పదజాలంలో దూషించాడని నర్సు ఆరోపించింది. ఈ ఘటనతో హెల్త్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రి అధికారులు పోలీసులను ఆశ్రయించగా.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు.

మైనర్ బాలికపై ల్యాబ్ టెక్నిషియన్ వేధింపులు

హౌరాలోని ఓ ఆస్పత్రిలో 13 ఏళ్ల బాలికను ల్యాబ్ టెక్నీషియన్ వేధించినట్లు పోలీసులు తెలిపారు. న్యూమోనియాతో బాధపడుతున్న బాలికను ఆమె కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం శనివారం రాత్రి హౌరాలోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే సిటీ స్కాన్ చేస్తుండగా ల్యాబ్ టెక్నీషియన్ అమన్ రాజ్ వేధింపులకు పాల్పడ్డారు. ల్యాబ్ బయట వేచి ఉన్న బాలిక తల్లి ఆమె కేకలు విని కుమార్తె వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బాధితురాలి కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగి నిందితుడిపై దాడికి యత్నించారు.

Advertisement

Next Story