US Elections 2024: అమెరికా ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు

by Shamantha N |   ( Updated:2024-11-06 11:20:47.0  )
US Elections 2024: అమెరికా ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ విజ‌యం ఖ‌రారైంది. దాంతో రెండోసారి అగ్ర‌రాజ్యం అధ్య‌క్షుడిగా ట్రంప్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఇక రిప‌బ్లిక‌న్ పార్టీ త‌మ ఉపాధ్య‌క్షుడిగా జేడీ వాన్స్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్.. వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి సేన్‌ జేడీ వాన్స్‌ ను ప్రశంసలతో ముంచెత్తారు. "నేను మొదట జేడీ వాన్స్ ని అభినందించాలనుకుంటున్నా. ఇప్పుడు నేను అతడ్ని ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ అని చెప్పగలను. అలానే జేడీ వాన్స్ సతీమణి ఉషాకు కంగ్రాచ్యులేషన్స్ " అని ట్రంప్ వెల్లడించారు. తనకు అనుక్షణం అండగా నిలిచారంటూ వాన్స్ ని ట్రంప్ కొనియాడారు.

జేడీ వాన్స్ ఎవరంటే?

అయితే, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగింటి అల్లుడే. ఆయ‌న‌ భార్య ఉష తెలుగు సంతతికి చెందిన వారు. ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాకు చెందిన ఉయ్యూరు. ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టిపెరిగారు. యేల్ యూనివర్సిటీలో ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో వారి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ పద్దతిలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇక, జేడీ వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు. ఒహాయో స్టేట్ యూనివర్శిటీ, యేల్ లా యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. అంతేకాకుండా పలు వ్యాపారాలు చేస్తున్నారు. వాన్స్ 2022లో అమెరికా సెనేట్ కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఒహాయో సెనేటర్ గా పోటీచేస్తున్న సమయంలో ఉషా చిలుకూరి ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భర్త విజయంలో కీలక పాత్ర పోషించారు.


Read More..

Donald Trump: ఇలాంటి విజయాన్ని ఎన్నడూ చూడలేదు

Advertisement

Next Story