'నేను రిటైర్ అయ్యే వ్యక్తిని కాను'.. రిటైర్మెంట్ ప్రోగ్రాంలో జస్టిస్ ఎంఆర్ షా ఎమోషనల్

by Vinod kumar |
నేను రిటైర్ అయ్యే వ్యక్తిని కాను.. రిటైర్మెంట్ ప్రోగ్రాంలో జస్టిస్ ఎంఆర్ షా ఎమోషనల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాను రిటైర్డ్‌ అయ్యే వ్యక్తిని కానని, జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నానని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఆర్‌ షా (ముకేశ్‌కుమార్ రసిక్‌భాయ్ షా) అన్నారు. సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్‌ ఎంఆర్‌ షా సోమవారంతో పదవీకాలం ముగిసింది. సుప్రీంకోర్టు హాల్‌లో సోమవారం నిర్వహించిన పదవి విరమణ కార్యక్రమంలో ఎంఆర్‌షా చివరిసారి ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌ నేతృత్వంలోని అధికారిక బెంచ్‌లో కూర్చుని జస్టిస్‌ షా చివరిసారి ప్రసంగించారు. తాను జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతున్నానని, తనకు బలం, ధైర్యం, ఆరోగ్యం ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థించాలన్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ఆయన.. ‘కల్ ఖేల్ మే హమ్ హో నా హో.. గార్దిష్ మే తారే రహేంగే సదా’ పాట గుర్తుకు వస్తుందన్నారు.

తన ప్రసంగం ముగింపు సందర్భంగా ‘జీనా యహాన్, మర్నా యహాన్’ పాటను పాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసేందుకు సహకరించిన బార్‌ సభ్యులు, సుప్రీంకోర్టు అధికారులు, సహాయ సిబ్బందికి జస్టిస్‌ షా కృతజ్ఞతలు తెలిపారు. తాను అర్హుడో కాదో నాకు తెలియదని.. అయితే, వీడ్కోలను బహుమతిగా స్వీకరిస్తున్నానని షా పేర్కొన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నానన్నారు. తనపై కురిపించిన ప్రేమ, ఆప్యాయతలకు పొంగిపోయానని, అందరికీ తాను కృతజ్ఞుడినన్నారు. వీడ్కోలు సందర్భంగా జస్టిస్‌ ఎంఆర్‌షాతో తనకున్న అనుబంధాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ గుర్తు చేసుకున్నారు. కాగా, నవంబర్ 2,2018న సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఆయన రిటైర్‌మెంట్‌తో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య సీజేఐతో కలిసి 32కి చేరింది. ఇంతకు ముందు జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి పదవీ విరమణ చేశారు.

Advertisement

Next Story

Most Viewed