చైనా నుంచి ఒక్క పైసా రాలేదు.. న్యూస్ క్లిక్ ఫౌండర్

by Vinod kumar |
చైనా నుంచి ఒక్క పైసా రాలేదు.. న్యూస్ క్లిక్ ఫౌండర్
X

న్యూఢిల్లీ: చైనా అనుకూల ప్రచారానికి ఆ దేశం నుంచి డబ్బులు అందుకున్నారనే ఆరోపణలతో న్యూస్ క్లిక్ ఫౌండర్ ప్రబీర్ పుర్కాయస్థను ఉపా చట్టం కింద ఈ నెల 3వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని, డ్రాగన్ నుంచి ఒక్క పైనా కూడా తనకు రాలేదని ప్రబీర్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. తమపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను, తమ కస్టడీని సవాల్ చేస్తూ ప్రబీర్, న్యూస్ పోర్టల్ హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్) హెడ్ అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

న్యూస్ క్లిక్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. పుర్కాయస్థ, అమిత్‌లను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలూ చూపలేదని తెలిపారు. ఢిల్లీ పోలీసుల తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ కేసు తీవ్రమైన నేరాలకు సంబంధించినదని తెలిపారు. చైనా నుంచి న్యూస్ క్లిక్‌కు సుమారు 75 కోట్లు అందాయని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పును రిజర్వ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed