నార్వే మహిళ అసాధారణ ఫీట్‌.. 92 రోజుల్లోనే 14 శిఖరాలు ఎక్కింది

by Vinod kumar |
నార్వే మహిళ అసాధారణ ఫీట్‌.. 92 రోజుల్లోనే 14 శిఖరాలు ఎక్కింది
X

న్యూఢిల్లీ : వాళ్లిద్దరూ అసాధ్యులు.. కేవలం 92 రోజులలో 8,611 మీటర్ల ఎత్తులో ఉన్న మొత్తం 14 శిఖరాలను అధిరోహించి అసాధారణ ఫీట్‌ను సాధించారు. నార్వే మహిళ క్రిస్టిన్ హరిలా (37), ఆమె నేపాలీ షెర్పా గైడ్ టెంజెన్ (35) ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. క్రిస్టిన్ హరిలా, షెర్పా గైడ్ టెంజెన్ ల పర్వతారోహణ మిషన్.. పాకిస్థాన్‌లోని మౌంట్ K2 శిఖరంపైకి చేరడంతో ముగిసింది. పర్వతారోహకులకు లాజిస్టిక్స్‌ను అందించే నేపాలీ ఆర్గనైజింగ్ కంపెనీ సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ (ఎస్ఎస్టీ) సహకారంతో ఆ ఇద్దరు కలిసి రికార్డ్ బ్రేకింగ్ ఫీట్‌ని సాధించారు. దీంతో ఇంతకుముందు 2019 సంవత్సరంలో 6 నెలల ఒక వారం రోజుల వ్యవధిలో 14 శిఖరాలను అధిరోహించిన నిర్మల్ పుర్జా రికార్డును క్రిస్టిన్ హరిలా జోడీ బద్దలు కొట్టింది.

త్వరలోనే వీరిద్దరి పేర్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి కూడా ఎంట్రీ కాబోతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 26న చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న శిషాపంగ్మా శిఖరం వైపు నుంచి క్రిస్టిన్ హరిలా, గైడ్ టెంజెన్ జోడీ జర్నీని మొదలుపెట్టింది. ఆ తర్వాత వరుసగా నేపాల్‌లోని ఎవరెస్ట్, కాంచన గంగా, లోట్సే, మకాలు, చో ఓయు, ధౌలగిరి, మనస్లు, అన్నపూర్ణ, నంగా పర్బత్, గషెర్‌బ్రమ్ I, గాషెర్‌బ్రమ్ II, బ్రాడ్ పీక్‌ శిఖరాలను దాటుకుంటూ అంచులో ఉన్న K2 శిఖరంపైకి చేరుకున్నారు. 92 రోజులలో మొత్తం 14 శిఖరాలను అధిరోహించారు.

Advertisement

Next Story