క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదు: బీజేపీ డిమాండ్‌పై ఖర్గే

by Harish |
క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదు: బీజేపీ డిమాండ్‌పై ఖర్గే
X

న్యూఢిల్లీ: బ్రిటన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రశ్నే లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం చెప్పారు. ‘ప్రజాస్వామ్యం దాడికి గురవుతోంది’ అని యూకేలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ, పలువురు సీనియర్ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ‘రాహుల్‌ను క్షమాపణలు అడుగుతున్న వారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మోడీ ఐదారు దేశాలకు వెళ్లి భారత ప్రజలన అవమానించారు. మరి దాని గురించి ఏమంటారు? అంటే భారతదేశంలో పుట్టడం నేరమా? అని వాళ్లను అడుగుతున్నాను’ అని ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

‘ప్రజాస్వామ్యం ఇక్కడ క్షీణిస్తోంది. భావ ప్రకటన, వాక్ స్వాతంత్య్రం నిర్వీర్యం అవుతున్నాయి. టీవీ చానెళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. నిజాలు మాట్లాడితే జైలుకు పంపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అంతమొందించడం కాకపోతే మరేంటి?’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మీడియాతో అన్నారు. కనుక క్షమాపణ చెప్పే ప్రశ్నేలేదు అని ఆయన చెప్పారు.

ఇటీవల యూకేలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు భారత పార్లమెంట్‌ను కుదిపేశాయి. బడ్జెట్ సెషన్ రెండో భాగంలో తొలి రెండు రోజులు ఉభయ సభలు ఎటువంటి ముఖ్యమైన లావాదేవీలను నిర్వహించలేకపోయాయి. భారత ప్రజాస్వామ్య నిర్మాణాలపై దాడి జరుగుతోందని ఒక కార్యక్రమంలో రాహుల్ అన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష సభ్యుడు ఏదైనా ముఖ్యమైన సమస్య లేవనెత్తినప్పుడు లోక్‌సభలో మైక్‌లు కట్ చేస్తారని బ్రిటీష్ పార్లమెంటేరియన్లతో రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే.

రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. విదేశీ గడ్డపై భారత దేశాన్ని కించపరిచారని, విదేశీ జోక్యాన్ని కోరుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో ప్రధాని మోడీ విదేశీ పర్యటనల్లో అంతర్గత విషయాలను లేవనెత్తిన సందర్భాలను కాంగ్రెస్ ఉదహరిస్తూ అధికార పక్షాన్ని దెబ్బతీస్తోంది.

Advertisement

Next Story

Most Viewed