ప్రధానిగా ఎవరున్నా భారత్ 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారడం ఖాయం: పి చిదంబరం

by S Gopi |
ప్రధానిగా ఎవరున్నా భారత్ 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారడం ఖాయం: పి చిదంబరం
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల హీట్ కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి ఎవరు ప్రధానమంత్రి అయినా సరే భారత్ ప్రపంచ 3వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అవతరిస్తుందని స్పష్టం చేశారు. దేశ జానాభా పరిమాణాన్ని బట్టి భారత్ ఈ ఘనతను సాధించగలదు. ఇందులో ఎలాంటి మ్యాజిక్ లేదని తెలిపారు. ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. 'నరేంద్ర మోడీ అతిశయోక్తులు చెప్పడంలో మాస్టర్. ఆయన నమోదవుతున్న గణాంకాలను తనదిగా చెప్పుకుంటున్నారు. భారత్ మూడో ప్రపంచ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారడం అనివార్యం. 2004లో భారత జీడీపీ 12వ స్థానంలో ఉంది. 2014లో ఏడో స్థానానికి ఎగబాకింది. 2024లో ఐదో స్థానానికి చేరుకుంది. అలాంటపుడు ఎవరు ప్రధానమంత్రి అయినా జీడీపీ పరంగా మూడో స్థానానికి చేరుకుంటుంది. ఇందులో మాయాజాలం ఏంలేదు ' అని వివరించారు. అయితే, ఒక దేశ జీడీపీ పరిమాణం దాని ప్రజల శ్రేయస్సుకు ఖచ్చితమైన కొలమానం కాదని, తలసరి ఆదాయం దాన్ని నిజమైన కొలమానమని చిదంబరం అభిప్రాయపడ్డారు. నా దృష్టిలో జీడీపీ కంటే తలసరి ఆదాయమే ప్రజల శ్రేయస్సుకు ఖచ్చితమైన కొలమానం. దీని ప్రకారం భారత్ చాలా వెనుకబడి ఉందన్నారు. ఐఎమెఫ్ 2024 అంచనాల ప్రకారం, భారత తలసరి జీడీపీ 2,731 డాలర్లతో గ్లోబల్ ర్యాంకింగ్‌లో 136వ స్థానంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed