కుల గణనను ఏ శక్తీ అడ్డుకోలేదు: రాహుల్ గాంధీ

by S Gopi |
కుల గణనను ఏ శక్తీ అడ్డుకోలేదు: రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కీలక విమర్శలు చేశారు. తమని తాము దేశభక్తులుగా చెప్పుకునేవారు కులగణనకు సంబంధించిన విషయంలో మాత్రం భయపడుతున్నారని విమర్శించారు. అయినప్పటికీ దేశంలో కులగణనను ఎవరూ ఆపలేరని, ఏ శక్తీ అడ్డుకోలేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బుధవారం 'సామాజిక్ న్యాయ్ సమ్మేళన్' కార్యక్రమంలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ, బీజేపీఈ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్యాయం జరిగిన 90 శాతం జనాభాకు న్యాయం జరిగేలా చూడడమే తన జీవిత ధ్యేయమని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మొదటిపని కులగణనను చేపడుతుందని హామీ ఇచ్చారు. కులగణనపై తాను ఎన్నడూ రాజకీయం చేయలేదని, కులగణన అంటే కేవలం కులాలకు సంబంధించిన సర్వే మాత్రమే కాదని, ఆర్థిక, వ్యవస్థీకృత సర్వేను కూడా నిర్వహిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. బడా వ్యాపారులకు రుణమాఫీగా ఇచ్చిన రూ.16 లక్షల కోట్లలో కొంత భాగాన్ని 90 శాతం మంది భారతీయులకు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ మేనిఫెస్టో లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story