Supreme Court: దృష్టిలోపం ఉన్నవారు కూడా న్యాయమూర్తులు అవ్వొచ్చు: సుప్రీంకోర్టు

by S Gopi |
Supreme Court: దృష్టిలోపం ఉన్నవారు కూడా న్యాయమూర్తులు అవ్వొచ్చు: సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: దృష్టిలోపం ఉన్నవారు కూడా న్యాయమూర్తులు కావడానికి అర్హులని భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా దృష్టిలోపం ఉన్న వ్యక్తులు న్యాయ సేవల నియామకాల్లో పాల్గొనకుండా నిరోధించే మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్ నిబంధనను కొట్టివేసింది. వైకల్యం ఉందన్న కారణంతో న్యాయసేవలో రిక్రూట్‌మెంట్‌కు హాజరయ్యే అవకాశాన్ని ఏ అభ్యర్థికీ నిరాకరించరాదని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 'వికలాంగులు న్యాయ సేవలలో ఎలాంటి వివక్షను ఎదుర్కోకూడదు. దీనిపై రాష్ట్రాలు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. వైకల్యం కారణంగా ఏ అభ్యర్థికి అలాంటి అవకాశాన్ని నిరాకరించకూడదు' అని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

మధ్యప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్ రూల్స్ (6ఏ)ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణకు స్వీకరించింది. దీని ప్రకారం దృష్టిలోపం ఉన్నవారు న్యాయ సేవల నియామకం కోసం ఎంపిక ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించారు. దృష్టిలోపం ఉన్న తన కుమారుడు న్యాయమూర్తి కావాలని ఆశించినప్పటికీ ఎంపిక ప్రక్రియకు హాజరుకాలేకపోయాడంటూ ఓ మహిళ ఈ నియమాన్ని సవాలు చేసింది. దీనికి సంబంధించి ఆమె 2024 మార్చిలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. దీన్ని ప్రధాన న్యాయమూర్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మార్చారు. తాజాగా సుప్రీంకోర్టు ఈ నిబంధనలను కొట్టివేస్తూ వికలాంగులను మినహాయించే పరోక్ష వివక్షను.. అది కటాఫ్‌లు లేదా విధానపరమైన అడ్డంకులైనా సరే నిషేధించాలని, తద్వారా పౌరుల ప్రాథమిక సమానత్వాన్ని కాపాడాలని స్పష్టం చేసింది.

Next Story

Most Viewed