Nirmala seetharaman: ప్రతి రాష్ట్రానికీ నిధులు కేటాయించాం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

by vinod kumar |
Nirmala seetharaman: ప్రతి రాష్ట్రానికీ నిధులు కేటాయించాం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌లో ప్రతి రాష్ట్రానికి నిధులు కేటాయించామని, ఒక్క రాష్ట్రానికి కూడా నిధులు నిరాకరించలేదని ఆర్థిక మంత్రి సీతారామన్ స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రసంగంలో ఏదైనా రాష్ట్రం పేరు చెప్పకపోతే.. ఆ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు జరగనట్టు కాదని తెలిపారు. ప్రతిపక్ష నేతలు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా మంగళవారం ఆమె లోక్ సభలో మాట్లాడారు. గతంలో యూపీఏ ప్రభుత్వం చేసిన బడ్జెట్‌ స్పీచ్‌లోనూ అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించలేదని గుర్తు చేశారు. ‘2004-2005 బడ్జెట్‌లో17 రాష్ట్రాల పేరు లేదు. ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వంలోని సభ్యులు ఆ 17 రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదా’ అని ప్రశ్నించారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని కొనియాడారు. కొవిడ్ మహమ్మారి అనంతర ప్రభావాలను వేగంగా అధిగమించిందని నొక్కి చెప్పారు.

బడ్జెట్‌లో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి వంటి ఐదు పథకాలతో కూడిన యువత ప్యాకేజీని తీసుకొచ్చామని తెలిపారు. గత ఏడాది బడ్జెట్‌తో పోల్చితే వివిధ సామాజిక పథకాలకు బడ్జెట్‌ కేటాయింపులు పెరిగాయన్నారు. 2013-14లో వ్యవసాయం, అనుబంధ రంగాల కేటాయింపులు రూ. 30,000 కోట్లు కాగా, ఇప్పుడు రూ.1.52 లక్షల కోట్లుగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఆర్థిక లోటు పథానికి అనుగుణంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ ఏడాది జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి బడ్జెట్‌లో రూ. 17,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించామని గుర్తు చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి రూ. 48.21లక్షల కోట్ల బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

Advertisement

Next Story