NIA Searches: ఐదు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఉగ్రవాద కుట్ర కేసుపై చర్యలు!

by vinod kumar |
NIA Searches: ఐదు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఉగ్రవాద కుట్ర కేసుపై చర్యలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐదు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) శనివారం తనిఖీలు చేపట్టింది. మహారాష్ట్ర జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, అసోం, ఢిల్లీల్లోని 22 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. ఓ ఉగ్రవాద కుట్ర కేసుకు సంబంధించి ఎన్ఐఏ చర్యలు తీసుకుంటున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు పేర్కొన్నాయి. టెర్రర్ నెట్ వర్క్‌ను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని మాలేగావ్, జల్నా, సంభాజీనగర్‌లలో దాడులు నిర్వహించి పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వారికి ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్టు ఎన్ఐఏ భావిస్తోంది. వీరందరిపై విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

దర్యాప్తులో భాగంగా కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. బారామౌల్లా, దక్షిణ కశ్మీర్‌లోని కొన్ని కీలక ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. అయితే ఇక్కడ ఎవరినీ అరెస్టు చేయలేదు. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు కొందరు వ్యక్తులు నిధులు సమకూర్చినట్టు ఆరోపణలున్నాయి. అలాగే ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో ఎన్‌ఐఏ జరిపిన దాడిలో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం కూడా పాల్గొంది. ఇక్కడ అనుమానాస్పద వస్తువులు కనుగొనడంతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్ఐఏ ఒక్కసారిగా దాడులు చేయడంతో ఐదు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.

4 రోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌లో

ఎన్‌ఐఏ ఈ నెల 1న కూడా పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో దాడులు నిర్వహించింది. దక్షిణ 24 పరగణాలు, అసన్‌సోల్, హౌరా, నదియా, కోల్‌కతాలోని 11 చోట్ల సోదాలు చేసింది. ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పలువురు వ్యక్తులు ఇళ్లపై దాడులు చేసిన నేపథ్యంలో ఎన్ఐఏ తనిఖీలు చేసింది. అయితే దాడులు చేసింది మావోయిస్టు పార్టీకి చెందిన వారని వెల్లడించింది.

Advertisement

Next Story