'పోర్ట్ బ్లెయిర్‌లో విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవనం'

by Vinod kumar |
పోర్ట్ బ్లెయిర్‌లో విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవనం
X

న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల రాజధాని, ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పోర్ట్ బ్లెయిర్‌లో రూ.710 కోట్లతో వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. దీన్ని ప్రధాని మోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ కొత్త సదుపాయంతో కేంద్రపాలిత ప్రాంతమైన ద్వీపానికి కనెక్టివిటీ మెరుగవుతుంది. దాదాపు 40,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం ఏటా 50 లక్షల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. రెండు బోయింగ్, రెండు ఎయిర్ బస్ విమానాలను ఏకకాలంలో ఉంచేందుకు అనువైన షెల్టర్‌ను రూ.80 కోట్లతో నిర్మించారు.

ఒకేసారి 10 విమానాలను పార్కింగ్ చేయగలిగే సామర్థ్యం ఈ విమానాశ్రయానికి ఉందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కొత్తగా నిర్మించిన ఈ విమానాశ్రయ టెర్మినల్ భవనంలో వేడిని తగ్గించడానికి డబుల్ ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. భవనంలో పగటిపూట సూర్యరశ్మి సమృద్ధిగా అందేట్లు స్కైలైట్లు అమర్చారు. షెల్ ఆకారంలో నిర్మించిన విమానాశ్రయ టెర్మినల్‌లో ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ కూడా ఉంది. వర్షపు నీటిని ఒడిసి పట్టే యంత్రాంగం, మురుగునీటిని శుద్ధి చేసి 100% పునర్వినియోగం కోసం మురుగునీటి శుద్ధి కర్మాగారం, 500 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఇక్కడ ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed