- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sri Lanka: శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో దిసనాయకే పార్టీ హవా
దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో (Sri Lanka Elections) అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. గురువారం జరిగిన పార్లమెంటరీ ఎన్నికల ఓటింగ్ లో సగానికి పైగా ఓట్లు లెక్కించగా దిసనాయకే నేషనల్ పీపుల్స్ పవర్ (NPP) సంకీర్ణ పార్టీ 63 శాతం ఓట్లతో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే 225 మంది సభ్యుల సభలో ఎన్‌పీపీ దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ లీడింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుత పార్లమెంటులో ఆ పార్టీ బలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండటం గమనార్హం. ఇక సెప్టెంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అనుర దిసనాయకే అధికారం చేజిక్కించుకున్నారు. అవినీతిని ఎదుర్కోవడంతోపాటు దేశం కోల్పోయిన ఆస్తులను తిరిగి సంపాదిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గురువారం కొలంబోలో దిసనాయకే ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో "బలమైన మెజారిటీ"తో ముందుకు సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. "ఇవి శ్రీలంకలో కీలకమైన ఎన్నికలు అని నమ్ముతున్నాం. ఇక్కడ రాజకీయాలు వీటితోనే మలుపు తిరుగుతాయి. ఎన్ పీపీ కూటమి పార్లమెంటులో చాలా బలమైన మెజారిటీ కోసం ఎదురుచూస్తోంది" అని చెప్పుకొచ్చారు.
ఆర్థిక సంక్షోభం తర్వాత తొలిసారిగా ఎన్నికలు
2022 శ్రీలంక ఆర్థిక సంక్షోభం తర్వాత తొలిసారిగా పార్లమెంటు ఎన్నికలు గురువారం జరిగాయి. మొత్తం 225 సీట్లలో 196 సీట్లకు నేరుగా పోలింగ్ జరిగింది. 8,821 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మిగితా 29 సీట్లను నేషనల్ లిస్ట్ ఆధారంగా నిర్ణయిస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 13,314 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. దాదాపు 65 శాతం ఓటింగ్ నమోదయింది. అయితే అధ్యక్ష ఎన్నికలతో పోల్చితే ఇది తక్కువే. సెప్టెంబర్‌లో జరిగిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.