New Orleans Attack : జనంపైకి ట్రక్కు నడిపింది మాజీ అమెరికా సైనికుడే : జో బైడెన్

by Hajipasha |
New Orleans Attack : జనంపైకి ట్రక్కు నడిపింది మాజీ అమెరికా సైనికుడే : జో బైడెన్
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఆర్లియన్స్‌ నగరం(New Orleans)లో బుధవారం రోజు జనంపైకి ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 15కు పెరిగింది. దీనికి సంబంధించిన కీలక వివరాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) వెల్లడించారు. జనంపైకి ట్రక్కు నడిపిన వ్యక్తి పేరు షంషుద్దీన్‌ జబ్బార్‌(42) అని, అతడు అమెరికా పౌరుడేనని చెప్పారు.టెక్సాస్‌‌లో జబ్బార్(Shamsud Din Jabbar) నివసించేవాడని ఆయన తెలిపారు. గతంలో అమెరికా ఆర్మీలో జబ్బార్ పనిచేశాడని బైడెన్ పేర్కొన్నారు. జనంపైకి జబ్బార్ నడిపిన ట్రక్కులో ఐసిస్ జెండాను గుర్తించామన్నారు. ట్రక్కు దాడి చేయడానికి ముందు అతడు సోషల్ మీడియాలో చేసిన పోస్టును బట్టి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపు నుంచి ప్రేరణ పొందాడని తేలిందని ఆయన పేర్కొన్నారు.

జబ్బార్ నడిపిన ట్రక్కులో పేలుడు పదార్థాలు కూడా లభ్యమయ్యాయని బైడెన్ చెప్పారు. ఇక ఇదే అంశంపై ఎఫ్‌బీఐ(FBI) అసిస్టెంట్ స్పెషల్ ఏజెంట్ ఇన్‌ఛార్జ్ అలెథియా డంకన్ స్పందించారు. ట్రక్కు దాడి ఘటనలో జబ్బార్‌తో పాటు ఇంకొందరి పాత్ర కూడా ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ట్రక్కు దాడి జరిగిన బార్బన్ వీధిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ముగ్గురు పురుషులు, ఒక మహిళ పేలుడు పదార్థాలను అమరుస్తూ కనిపించారని డంకన్ చెప్పారు. వాళ్లు ఎవరనేది గుర్తించే పనిలోనే ఉన్నామన్నారు. బార్బన్ వీధిలో పేలుళ్ల కోసం ఐఈడీలు, పైప్ బాంబులు కూడా అమర్చారని.. తమకు ఒక హ్యాండ్ గన్, ఏఆర్ స్టైల్ రైఫిల్ దొరికాయని తెలిపారు. కాగా, ట్రక్కు దాడికి పాల్పడిన షంషుద్దీన్‌ జబ్బార్‌ పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed