NEET UG Paper Leak : నీట్-యూజీ పేపర్ లీక్ కేసు.. సీబీఐ రెండో ఛార్జ్‌షీట్‌లో కీలక వివరాలు

by Hajipasha |
NEET UG Paper Leak : నీట్-యూజీ పేపర్ లీక్ కేసు.. సీబీఐ రెండో ఛార్జ్‌షీట్‌లో కీలక వివరాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన రెండో ఛార్జ్‌షీట్‌ను బిహార్ రాజధాని పాట్నాలోని ప్రత్యేక కోర్టులో సీబీఐ శుక్రవారం సమర్పించింది. పేపర్ లీక్‌కు కుట్ర పన్నిన ఆరుగురు నిందితుల పేర్లను ఇందులో ప్రస్తావించారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో నీట్-యూజీ పరీక్ష నిర్వహణతో సంబంధమున్న కీలక అధికారుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఆరుగురు నిందితుల్లో బల్‌దేవ్ కుమార్ అలియాస్ చింటు, సన్నీ కుమార్, డాక్టర్ అహసనుల్ హఖ్ (ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ - హజారీ బాగ్), ఇంతియాజ్ ఆలం(ఒయాసిస్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ - హజారీ బాగ్), జమాలుద్దీన్ (రిపోర్టర్ - హజారీబాగ్), అమన్ కుమార్ సింగ్ ఉన్నారు.

వీరిలో డాక్టర్ అహసనుల్ హఖ్ నీట్-యూజీ పరీక్షకు హజారీబాగ్ సిటీ ఏరియా కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ఇంతియాజ్ ఆలం నీట్-యూజీ పరీక్షకు హజారీబాగ్ సిటీ ఏరియా సెంటర్ సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. నేరపూరిత కుట్ర, మోసం, దొంగతనం, విశ్వాస ఘాతుకానికి సంబంధించిన అభియోగాలను వారిపై నమోదు చేశారు. డాక్టర్ అహసనుల్ హఖ్, ఇంతియాజ్ ఆలంలు కలిసి నీట్-యూజీ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు దర్యాాప్తులో సీబీఐ గుర్తించింది. సీబీఐ తన తొలి ఛార్జ్‌షీట్‌ను ఆగస్టు 1న దాఖలు చేసింది. అందులో 13 మంది పేర్లను నిందితుల జాబితాలో ప్రస్తావించింది. ఇప్పటివరకు 48 మందిని అరెస్టు చేసింది. వీరిలో విద్యార్థులు, లీకైన ప్రశ్నాపత్రాలకు ఆన్సర్లు రాసిచ్చినవారు, ఆ ఆన్సర్లు రెడీ చేయించినవారు కూడా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed