Neet re test: నీట్ రీటెస్ట్ అవసరం లేదు..సుప్రీంకోర్టు కీలక తీర్పు

by vinod kumar |
Neet re test: నీట్ రీటెస్ట్ అవసరం లేదు..సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: నీట్‌-యూజీ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పేపర్ లీకైందని రుజువు చేయడానికి అధికారికంగా తగిన ఆధారాలు లేవని కాబట్టి పరీక్షను మరోసారి కండక్ట్ చేయాలని ఆదేశించలేమని తెలిపింది. నీట్ ఎగ్జామ్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన 40కి పైగా పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల పాటు విచారణ చేపట్టింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, పిటిషనర్ల తరఫున పలువురు లాయర్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.

జార్ఖండ్‌లోని హజారీబాగ్‌, బిహార్‌లోని పాట్నాలోని సెంటర్లలో ప్రశ్నపత్రం లీకైందన్న మాట వాస్తవమేనని తెలిపింది. అయితే సీబీఐ నివేదిక ప్రకారం..కేవలం 155 మంది విద్యార్థులు మాత్రమే లబ్ది పొందారని సీజేఐ తెలిపారు. మళ్లీ పరీక్ష జరిపితే 24 లక్షల మంది విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అకడమిక్ షెడ్యూ్ల్‌కు సైతం విఘాతం కలుగుతుందని ఇది రాబోయే రోజుల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. లబ్ది పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు ఆదేశిస్తామని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్, ఇతర ప్రవేశ ప్రక్రియలను కొనసాగించడానికి కోర్టు అనుమతించింది. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి భవిష్యత్తులో పరీక్షల నిర్వహణకు మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

Advertisement

Next Story