నీట్-పీజీ పరీక్షల కొత్త తేదీల ప్రకటన.. రెండు షిఫ్టుల్లో నిర్వహణ

by S Gopi |
నీట్-పీజీ పరీక్షల కొత్త తేదీల ప్రకటన.. రెండు షిఫ్టుల్లో నిర్వహణ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎంఎస్) నీట్-పీజీ 2024 పరెక్షల కొత్త తేదీలను ప్రకటించింది. ఇటీవల నీట్-యూజీ వివాదం కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా నీట్-పీజీ 2024 పరీక్షలను ఆగష్టు 11న తేదీన నిర్వహించాలని ఎగ్జామ్ బోర్డు నిర్ణయించింది. పరీక్షలు రెండు షిఫ్టుల్లో జరుగుతాయని, దరఖాస్తుదారులు ఇతర వివరాలు, అప్‌డేట్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చని వెల్లడించింది. అంతకుముందు నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) జూన్ 23న జరగాల్సిన నీట్-పీజీ పరీక్షలను ముందు జాగ్రత్త చర్యగా వాయిదా వేసింది. ఆ తర్వాత జూలై 2నే కొత్త తేదీలను ప్రకటిస్తామని ఎన్‌బీఈఎంఎస్ చెప్పినప్పటికీ కేంద్రం ఆమోదం లభించకపోవడంతో శుక్రవారం పరీక్షల నిర్వహణ వివరాలు ప్రకటించింది. ఈసారి పరీక్షల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా రెండు గంటలకు ముందు మాత్రమే ప్రశ్నాపత్రాన్ని సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మారిన ఫార్మాట్‌.. రెండు షిఫ్టుల్లో పరీక్షలు

ఇటీవలి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆగష్టు 11న జరిగే నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. ప్రధానంగా పరీక్షల నిర్వహణ ప్రక్రియలో తలెత్తే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని భద్రత, పరీక్షల పవిత్రతను కాపాడేందుకు ఫార్మాట్‌లోనూ మార్పు చేసినట్టు అధికారులు తెలిపారు. సవరించిన ఫార్మాట్ ప్రకారం.. పలు విభాగాల్లో ప్రశ్నావళిని విభజిస్తారు. ప్రతి విభాగానికి పరిమిత సమయం కేటాయించబడుతుంది. అభ్యర్థులు ముందుగా ఒక విభాగానికి సంబంధించిన సమయాన్ని పూర్తి చేసిన తర్వాతే తదుపరి విభాగానికి వెళ్లేలా రూపొందిస్తారు. అభ్యర్థులకు ఒక విభాగం కోసం కేటాయించిన సమయం పూర్తయిన తర్వాత ప్రశ్నలను సమీక్షించేందుకు, సవరణకు అనుమతి ఉండదు. అలాగే, అభ్యర్థులు ఏదైనా ప్రశ్నకు సమాధానం ఇచ్చారా లేదా అనేదానితో సంబంధం లేకుండా మరొక ప్రశ్నకు మార్క్ చేయవచ్చు. దీనివల్ల కేటాయించిన సమయం ముగిసేలోపు అభ్యర్థులు ఈ మార్క్ చేసిన ప్రశ్నలను మళ్లీ చూసుకునేందుకు అనుమతి ఉంటుంది.

కాగా, నీట్-పీజీ పరీక్షలు 6,102 ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్/కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సుమారు 26,168 ఎండీ, 13,649 ఎంఎస్, 922 పీజీ డిప్లోమా సీట్లలో ప్రవేశానికి జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed