ఎన్సీపీ vs ఎన్సీపీ కేసు: మహారాష్ట్ర స్పీకర్‌కు ఫిబ్రవరి15 వరకు డెడ్ లైన్

by samatah |
ఎన్సీపీ vs ఎన్సీపీ కేసు: మహారాష్ట్ర స్పీకర్‌కు ఫిబ్రవరి15 వరకు డెడ్ లైన్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15 వరకు గడువు విధించింది. అంతకు మందు జనవరి 31వరకు టైం ఇవ్వగా..అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం అవసరమని స్పీకర్ కార్యాలయం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పిటిషన్ దాఖలు చేశారు. విచారణ ప్రకియ జనవరి 31తో ముగుస్తుందని తెలిపారు. కాబట్టి స్పీకర్‌కు మరింత టైం ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అందుకు అంగీకరించింది. అనర్హత పిటిషన్లపై డెసిషన్ తీసుకోవడానికి స్పీకర్‌కు మరో 15రోజులు టైం ఇస్తున్నట్టు పేర్కొంది.

కేసు నేపథ్యం

2022 మేలో శివసేనలో చీలిక ఏర్పడి ఆ పార్టీలోని కొంత మంది ఎమ్మెల్యేలు, బీజేపీ కలిసి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2023 జూలైలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ షిండే కేబినెట్‌లో చేరి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్సీపీలోని 40 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎమ్మెల్సీలు అజిత్ వర్గంలో చేరారు. దీంతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు లేఖ అందజేశారు. అయితే స్పీకర్ పట్టించుకోక పోవడంతో శరద్ పవార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Next Story