NCP crisis: తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎన్సీపీ అనర్హత పిటిషన్లు..

by Vinod kumar |
NCP crisis: తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఎన్సీపీ అనర్హత పిటిషన్లు..
X

ముంబై : మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్‌తో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన మరో ఎనిమిది మందిపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్‌సీపీ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ ప్రకటించారు. తిరుగుబాటు చేసిన ఇద్దరు ఎంపీలు సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ లపైనా అనర్హత పిటిషన్లను దాఖలు చేస్తామని వెల్లడించారు.

“వాళ్ల (తిరుగుబాటు ఎమ్మెల్యేల) చర్య చట్టవిరుద్ధం. వారు శరద్ పవార్‌ను, పార్టీని మోసగించి ఈ పని చేశారు. దీనిపై జయప్రకాష్ దండేగావ్కర్ నేతృత్వంలోని పార్టీ క్రమశిక్షణా కమిటీకి కూడా ఫిర్యాదు చేశాం. ఎన్‌సీపీ క్రమశిక్షణా సంఘం సిఫారసు మేరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర శాసనసభకు మెయిల్ పంపాం. వీలైనంత త్వరగా విచారణ జరపాలని కోరాం” అని జయంత్ పాటిల్ చెప్పారు. త్వరలోనే నేరుగా స్పీకర్ రాహుల్ నర్వేకర్‌ను కలిసి దీనికి సంబంధించిన భౌతిక కాపీని కూడా అందిస్తామన్నారు.

ఇదే అంశంపై భారత ఎన్నికల కమిషన్‌ కు కూడా ఫిర్యాదును పంపామని ఆయన చెప్పారు. పార్టీ విధానానికి వ్యతిరేకంగా వెళ్ళిన క్షణం, వారు సాంకేతికంగా అనర్హులు అని పాటిల్ స్పష్టం చేశారు. “పార్టీ విప్ ముఖ్యం అని సుప్రీంకోర్టు ఇటీవలి ఇచ్చిన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యం కాదు. కాబట్టి, జితేంద్ర అవద్‌ను పార్టీ అధికారిక విప్‌గా పరిగణిస్తారు. ఇది ఎమ్మెల్యేలందరికీ వర్తిస్తుంది” అని రాష్ట్ర NCP చీఫ్ జయంత్ పాటిల్ తేల్చి చెప్పారు. ఇక ఎన్‌సీపీ ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జే, పార్టీ అకోలా సిటీ జిల్లా అధ్యక్షుడు విజయ్ దేశ్‌ముఖ్, పార్టీ ముంబై డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేంద్ర రాణే లను పార్టీ నుంచి బహిష్కరించారు.

Advertisement

Next Story

Most Viewed