ఇక్బాల్ అన్సారీపై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు.. ఎవరాయన ?

by Dishanational4 |
ఇక్బాల్ అన్సారీపై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు.. ఎవరాయన ?
X

దిశ, నేషనల్ బ్యూరో : బాబ్రీ మసీదు తరఫున సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన మాజీ న్యాయవాది ఇక్బాల్ అన్సారీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్సారీ కుటుంబంలోని రెండు తరాలు బాబ్రీ మసీదు కోసం శతాబ్దాల తరబడి పోరాడాయని.. చివరకు హిందూపక్షానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వారు గౌరవించారని ప్రధాని గుర్తు చేశారు. ఇదంతా జరిగిన తర్వాత కూడా రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి, ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ఇక్బాల్ అన్సారీ హాజరవడం చాలా గొప్ప విషయమని ప్రధాని మోడీ కితాబిచ్చారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి రామమందిరం ట్రస్ట్ నుంచి అందిన ఆహ్వానాలను ఓ వైపు విపక్ష నేతలు తిరస్కరిస్తే.. మరోవైపు ఇక్బాల్ అన్సారీ మాత్రం పెద్దమనసుతో స్వీకరించారని ఆయన కొనియాడారు. మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా నుంచి ఒత్తిడి వచ్చినా వెరవలేదు

గతంలో భారత్‌లోకి ఉగ్రవాదులను పెద్దఎత్తున సప్లై చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు గోధుమ పిండి కోసం అల్లాడిపోయే దుస్థితికి చేరుకుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కరోనా సంక్షోభం తర్వాత పాకిస్తాన్ సహా చాలా దేశాలు దివాలా తీశాయని ఆయన గుర్తు చేశారు. భారత్ బలంగా ఉండేలా ఆర్థిక విధానాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అని చెప్పారు. గతంలో విదేశాల నుంచి ఆయుధాలను కొన్న భారత్.. ఇప్పుడు హైటెక్ ఆయుధాలను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందన్నారు. అమెరికా సహా పాశ్చాత్య దేశాల నుంచి ఒత్తిడి వచ్చినా వెరవకుండా.. దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చమురును కొన్నామని మోడీ తెలిపారు. కేంద్రంలో బలమైన, సుస్థిర ప్రభుత్వం కోసం దేశ ప్రజలు తప్పక బీజేపీకే ఓటు వేయాలని ప్రధానమంత్రి కోరారు.

Next Story

Most Viewed