Mpox case: భారత్‌లో మంకీపాక్స్ కేసులు లేవు..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి

by vinod kumar |
Mpox case: భారత్‌లో మంకీపాక్స్ కేసులు లేవు..కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది దేశంలో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సీనియర్ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించినట్టు వెల్లడించింది. ఆరోగ్య అధికారులను అప్రమతతం చేయడంతో పాటు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. విమానాశ్రయాలు, ఓడరేవులు, గ్రౌండ్ క్రాసింగ్‌లలోని ఆరోగ్య విభాగాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. అలాగే కేసును గుర్తించిన వెంటనే ఐసోలేట్ చేయడం, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో కేసులు వెలుగు చూసే అవకాశం ఉన్నప్పటికీ దేశంలో వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అనుమానిత వ్యక్తుల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్‌లను సైతం ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 2022 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో 30 కేసులు గుర్తించారు. కాగా, మంకీపాక్స్ వ్యాధిని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిపై సమీక్షించింది.

Advertisement

Next Story

Most Viewed