- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మంత్రుల బ్యాగ్రౌండ్ తెలుసా?

- ఢిల్లీ సీఎం, మంత్రుల ప్రొఫైల్ ఇదే
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. రేఖా గుప్తాతో పాటు ఆరుగురు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పార్టీల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన రేఖా గుప్తా మొదట హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అనంతర రాంలీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేశారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. కేబినెట్ మంత్రులుగా పర్వేశ్ వర్మ, ఆశీశ్ సూద్, మజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్‌లు ప్రమాణం చేశారు.
రేఖా గుప్తా: ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేఖా గుప్తా తొలి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్, కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత్, ఆప్‌కు చెందిన ఆతిషీ తర్వాత ఢిల్లీకి నాలుగవ మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. హర్యానాలోని జింద్‌లో జన్మించిన రేఖా గుప్తా.. వృత్తిరిత్యా లాయర్. ఆమె బనియా సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. బనియా సామాజిక వర్గం మొదటి నుంచి బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. ఏబీవీపీ నుంచి రాజకీయ ప్రారంభించిన రేఖా గుప్తా.. 1996-97లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. 2007లో పీతంపుర నార్త్ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా పని చేశారు.
పర్వేశ్ వర్మ: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రివాల్‌ను ఓడించి పర్వేశ్ వర్మ అందరి దృష్టిని ఆకర్షించారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన వర్మ తండ్రి షాహిబ్ సింగ్ వర్మ గతంలో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పని చేశారు. వెస్ట్ ఢిల్లీ నుంచి రెండు సార్లు ఎంపీగా పని చేసిన వర్మ గతంలో మతపరమైన వ్యాఖ్యలు చేసి వివాదాస్పదమయ్యారు. మొదటి నుంచి సీఎం రేసులో ఉన్న వర్మకు ఆ పదవి దక్కక పోయినా.. కేబినెట్‌లో చోటు దక్కింది.
ఆశీశ్ సూద్: జనక్‌పురి నుంచి ఎన్నికైన ఆశీశ్ సూద్ ఒక పంజాబీ. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ పక్ష నాయకుడిగా పని చేసిన అనుభవం ఉంది. పార్టీలో కింది స్థాయి నుంచి పని చేసిన అనుభవం ఉన్న నాయకుడు. ఏబీవీపీ నుంచి ప్రస్థానం ప్రారంభించిన ఆశీశ్ సూద్.. గోవా బీజేపీ ఇంచార్జిగా, జమ్ము కశ్మీర్ సహ ఇంచార్జిగా పని చేశారు. ఢిల్లీ బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న నాయకుడు. అందుకే బీజేపీ ఆయనకు కేబినెట్‌లో చోటు కల్పించింది.
మజీందర్ సింగ్ సిర్సా: ఢిల్లీలోని సిక్కు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు. గతంలో ఆయన అకాలీదళ్‌లో ప్రభావవంతమైన నాయకుడిగా పని చేశాడు. బీజేపీలో చేరిన తర్వాత ఆయనకు జాతీయ కార్యదర్శిగా పదవి దక్కింది. ఢిల్లీ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. రాజౌరీ గార్డెన్ నియోజకవర్గం నుంచి గెలిచిన మజీందర్ సింగ్ ఆప్ కన్వీనర్ కేజ్రివాల్‌పై పలు విమర్శలు, ఆరోపణలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
రవీందర్ ఇంద్రజ్ సింగ్ : మాజీ ఎమ్మెల్యే ఇంద్రజ్ సింగ్ కుమారుడే రవీందర్ ఇంద్రజ్ సింగ్. దళిత సామాజిక వర్గానికి చెందిన రవీందర్ బవానా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఢిల్లీ బీజేపీలో దళిత నాయకుడిగా గుర్తింపు పొందారు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటీమ్ మెంబర్‌గా పని చేస్తున్నారు.
కపిల్ మిశ్రా: రేఖా గుప్తా కేబినెట్‌లో పిన్నవయస్కుడిగా గుర్తింపు పొందారు. గతంలో ఆప్ ప్రభుత్వంలో కూడా కేబినెట్ మినిస్టర్‌గా పని చేశారు. అయితే అర్వింద్ కేజ్రివాల్‌పై అవినీతి ఆరోపణలు చేసి, అనంతరం బీజేపీలో చేరారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కపిల్ మిశ్రా.. గతంలో వివాదాస్పద హిందుత్వ వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
పంకజ్ కుమార్ సింగ్ : వృత్తిరిత్యా డెంటిస్ట్ అయిన పంకజ్ కుమార్ సింగ్.. ఢిల్లీలో ఠాకూర్లు, పూర్వాంచల్ ప్రాంతానికి ప్రతినిధిగా ఉన్నారు. అగ్రవర్ణాలకు ప్రతినిధిగా ఆయనకు ఢిల్లీ కేబినెట్‌లో చోటు దక్కింది.