లడఖ్‌లో భారీ నిరసనలు: రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్

by samatah |
లడఖ్‌లో భారీ నిరసనలు: రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు ఆదివారం భారీ నిరసనలు చేపట్టారు. లేహ్ జిల్లాలో వేలాది మంది వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. లడఖ్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించడం, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ను అమలు చేయడం, లేహ్, కార్గిల్‌లకు పార్లమెంట్‌లో ప్రత్యేక సీట్లు కేటాయించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే లడఖ్ ప్రజల డిమాండ్లను పరిగణనలోకి తీసుకునేందుకు కేంద్రం ఇప్పటికే హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. లేహ్, కార్గిల్‌లోని రెండు ప్రాంతాల ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలతో చర్చలు జరుపుతామని ఇటీవలే నిత్యానందరాయ్ ప్రకటించారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం లడఖ్ బంద్‌కు సైతం పిలుపునిచ్చి విజయవంతం చేశాయి. కాగా, 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అనంతరం కశ్మీర్‌ను, లడఖ్‌ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. కానీ రెండేళ్లలోనే లేహ్, కార్గిల్ ప్రజలు రాజకీయంగా తమ అధికారాలు బలహీనమయ్యాయని భావించారు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story