Manipur violence: మణిపూర్ హింసపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

by Vinod kumar |
Manipur violence: మణిపూర్ హింసపై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
X

న్యూఢిల్లీ: హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తాజా పరిస్థితిపై స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పునరావాస శిబిరాలు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి అప్డేటెడ్ సమాచారాన్ని తమకు అందజేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ , న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆర్డర్స్ జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 10కి వాయిదా వేసింది.

ఆర్మీని పెద్దఎత్తున మోహరించి కుకీ తెగలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన మణిపూర్ ట్రైబల్ ఫోరం వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. మణిపూర్ ట్రైబల్ ఫోరం తరఫున సీనియర్ న్యాయవాది కాలిన్ గోంసాల్వేస్ వాదన వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసులను మణిపూర్‌ గిరిజనులు విశ్వసించడం లేదన్నారు. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ లాంబా నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిషన్‌పై తమకు నమ్మకం లేదని తెలిపారు.

ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, లా కమిషన్ చైర్‌పర్సన్ ఏపీ షా‌తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కోర్టును కోరారు. దీనికి మణిపూర్ ప్రభుత్వం, కేంద్ర సర్కారు తరఫున భారత సొలిసిటర్ జనరల్ సమాధానమిస్తూ.. పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోందని చెప్పారు. రోజులో 5 గంటల పాటు కర్ఫ్యూ సడలిస్తున్నారని, పరిస్థితి కుదుటపడుతోందనడానికి ఇది నిదర్శనమని వివరించారు. మైతై వర్గానికి చెందిన ఒక సంస్థ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ.. హింస వెనుక మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయా అనే దానిపై విచారణ జరపాలన్నారు. మూడు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం మైతై, కుకీ తెగల మధ్య హింసాకాండలో బాధితుల పునరావాసానికి చేపట్టిన చర్యలను తెలుపుతూ తాజా స్టేటస్ రిపోర్ట్ ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరో ముగ్గురు మృతి..

మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది. తాజాగా బిష్ణుపూర్ జిల్లాలోని ఖోయిజుమంతబి గ్రామంలో జరిగిన అల్లర్లలో ముగ్గురు “గ్రామ వాలంటీర్లు” మరణించారు. వీరు గ్రామంలోని తాత్కాలిక బంకర్‌లో కాపలాగా ఉండగా.. గుర్తు తెలియని ముష్కరులు వచ్చి జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు.

గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. చికిత్స నిమిత్తం ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు కుకీ సంస్థలు యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్, కుకి నేషనల్ ఆర్గనైజేషన్ మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లా పరిధిలోని NH-2 (ఇంఫాల్-దిమాపూర్) జాతీయ రహదారిపై రోడ్‌బ్లాక్‌లను ఉపసంహరించుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed