Manipur : మణిపూర్‌లో పటిష్ట భద్రత.. యాంటీ-డ్రోన్ సిస్టమ్‌ మోహరింపు

by vinod kumar |
Manipur : మణిపూర్‌లో పటిష్ట భద్రత.. యాంటీ-డ్రోన్ సిస్టమ్‌ మోహరింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో రోజు రోజుకూ హింసాత్మక ఘటనలు పెరిగి పోతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించింది. ఎలాంటి డ్రోన్ దాడినైనా ఎదుర్కొనేందుకు ఇంఫాల్ వ్యాలీలోని మారుమూల ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ వీటిని ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) వీటిని పరీక్షించి రాష్ట్ర పోలీసులకు అందజేసినట్టు వెల్లడించారు. అంతేగాక పోలీసుల కోసం కొత్త ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మిలిటెంట్లు దాడులకు డ్రోన్‌లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే యాంటి డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మిలిటెంట్ల డ్రోన్ దాడులను అడ్డుకోవడమే లక్ష్యంగా వీటిని మోహరించారు.

కాగా, ఈనెల1 నుంచి రాష్ట్రంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంది. మిలిటెంట్లు రైఫిల్స్, గ్రెనేడ్ల వంటి ఆయుధాలతో పాటు డ్రోన్లు, రాకెట్లను ఉపయోగిస్తున్నారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కౌత్రుక్ గ్రామంలో మొదటిసారిగా రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్‌లను ఉపయోగించి పేలుడు పదార్థాలను పడేశారు. ఆ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరుసటి రోజు సెంజామ్ చిరాంగ్‌లో మళ్లీ డ్రోన్ దాడి చేయగా ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సీఎం బిరేన్‌ సింగ్ ఈ దాడులను ఉగ్రవాద చర్యలుగా అభివర్ణించారు. మరోవైపు గత ఆరు నెలల్లో భద్రతా దళాలు మణిపూర్‌లో సుమారు18 డ్రోన్‌లను కూల్చేశాయి.

Advertisement

Next Story

Most Viewed