Manipur: 1500 మంది ముట్టడి.. 12 మంది మిలిటెంట్లు రిలీజ్

by Vinod kumar |
Manipur: 1500 మంది ముట్టడి.. 12 మంది మిలిటెంట్లు రిలీజ్
X

ఇతాం (మణిపూర్) : మణిపూర్ మిలిటెంట్ల సానుభూతిపరులు దుశ్చర్యకు తెగబడ్డారు. గుంపుగా వచ్చి 12 మంది సాయుధ తిరుగుబాటుదారులను ఆర్మీ నుంచి విడిపించుకుపోయారు.. ఈ ఘటన ఇతాం గ్రామంలో చోటుచేసుకుంది. కార్డన్ సెర్చ్ చేస్తున్న ఇండియన్ ఆర్మీ స్పియర్ కార్ప్స్ దళం 12 మంది మిలిటెంట్లను ఆర్మీ అరెస్ట్ చేసింది. వారంతా మైతై మిలిటెంట్ గ్రూప్ "కంగ్లీ యావోల్ కన్న లుప్" కు చెందినవారని గుర్తించింది. ఆయుధాలు, మందుగుండుతో నిండి ఉన్న పలు ఇళ్లను కూడా ఆర్మీ సీజ్ చేసింది. ఈ విషయం తెలియడంతో దాదాపు 1500 మంది గుంపు వచ్చి విధుల్లో ఉన్న ఇండియన్ ఆర్మీ స్పియర్ కార్ప్స్ దళాన్ని చుట్టుముట్టింది. 1500 మంది గుంపులో ముందు వరుసలో మహిళలు.. ఒక స్థానిక నాయకుడు ఉన్నాడు.. ఆర్మీ అరెస్ట్ చేసిన 12 మంది మిలిటెంట్లను రిలీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆర్మీ ఎంత చెప్పినా వినిపించుకోలేదు.. ఈ క్రమంలో ఇంత పెద్ద జన సమూహంపై కాల్పులు జరిపితే ప్రాణనష్టం జరిగే ముప్పు ఉంటుందనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఆర్మీ 12 మంది మిలిటెంట్లను వారికి అప్పగించింది. శనివారం రోజు జరిగిన ఈ ఘటన ఆర్మీ ట్విట్టర్ వేదికగా చేసిన ప్రకటనతో ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆర్మీ రిలీజ్ చేసిన 12 మందిలో డేంజరస్ మిలిటెంట్ మొయిరాంగ్థెమ్ తంబాగా అలియాస్ ఉత్తమ్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. బహుశా అతడిని కాపాడేందుకే అంతమంది వచ్చి చుట్టుముట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. 2015లో మణిపూర్‌లోని 6వ డోగ్రా రెజిమెంట్‌పై దాడి కేసులో ప్రధాన సూత్రధారిగా మొయిరాంగ్థెమ్ తంబాగా ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed